Cyber Criminal Arrest in Hyderabad : సైబర్ నేరగాళ్లు యధేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. రోజుకో కొత్త పంథాతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఓవైపు పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా, సైబర్ కేటుగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా, పలువురు వీరి ఉచ్చులో చిక్కుకుని జేబులు గుల్ల చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది.
మహారాష్ట్ర పోలీసులమంటూ సైబర్ నేరగాళ్లు ఆమెకు ఫోన్ చేసి, మనీలాండరింగ్ కేసులో మీ పేరుందంటూ భయపెట్టారు. స్కైప్ ద్వారా మహిళతో వీడియో కాల్ చేసి రాత్రంతా సదరు నేరగాడు మాట్లాడారు. కేసు నుంచి తప్పించుకోవాలంటే తాము చెప్పిన అకౌంట్‌కు రూ.60లక్షలు నగదు బదిలీ చేయాలని చెప్పారు. వాళ్లు చెప్పినట్లే చేసిన తర్వాత మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు, అనంతరం వెంటనే 1930 కాల్ సెంటర్‌కు ఆమె ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. దీంతో సైబర్ సెక్యురిటీ బ్యూరో అధికారులు స్పందించి మొత్తం నగదును ఫ్రీజ్ చేశారు. వేగంగా స్పందించిన కాల్ సెంటర్ సిబ్బందిని అదనపు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ అభినందించారు.
Cyber Cheater Arrest in Fee Concession Fraud : మరోవైపు విదేశీ వర్సిటీల్లోని సెమ్‌స్టర్ ఫీజులో పది శాతం రాయితీ కల్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న కేటుగాడిని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. తన స్నేహితులతో కలిసి మోసాలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. తిరుమలగిరికి చెందిన బాధితుడు తాను యూఎస్ విశ్వవిద్యాలయంలో సెమిస్టర్ ఫీజు పేరిట మోసపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అశోక్ కుమార్, అతని మిత్రుడు దిల్లీకి చెందిన తరుణ్‌రావు గతంలో కన్సల్టెన్సీలో పనిచేశారు. అయితే విదేశీ విద్యార్ధుల సమాచారం వీరి వద్ద ఉండడంతో వారిని సంప్రదించి యూఎస్ విశ్వవిద్యాలయాల్లో సెమిస్టర్ పరీక్షల ఫీజుల్లో పది శాతం రాయితీ ఇప్పిస్తామని తెలిపారు. వారి మాటలు నమ్మిన బాధిత విద్యార్ధి, వారు సూచించిన బ్యాంకు ఖాతాకు రూ.4 లక్షలకు పైగా డబ్బులు జమ చేశాడు. అయితే కొద్ది రోజులకే సెమిస్టర్ ఫీజు చెల్లించలేదని తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టి అశోక్‌కుమార్‌ను అరెస్టు చేశారు.