CS Jawahar Reddy reviewed with officials: భూమి, ఆస్తులు, విద్యుత్, తాగునీరు, వైద్యారోగ్యం, విద్యాశాఖలకు సంబంధించిన అంశాలపై చర్యల నివేదికను నీతి ఆయోగ్‌కు అందించాల్సి ఉందని, ఉన్నతాధికారులకు సీఎస్ జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన నీతి ఆయోగ్ ప్రాజెక్టులపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టులపై ప్రస్తుత స్థితిని ఐదు శాఖలకు చెందిన అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నిర్ణయాలను త్వరితగతిన అమలు చేసేలా: వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి నీతి ఆయోగ్ ( NITI Aayog ) ప్రాజెక్టులపై సీఎస్ జవహర్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో ఐదు శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఆయా ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిని అడిగి తెలుసుకున్నారు. భూమి, ఆస్తులు, విద్యుత్, తాగునీరు, వైద్యారోగ్యం, విద్యాశాఖలకు సంబంధంచిన అంశాలపై చర్యల నివేదికను నీతి ఆయోగ్ కు అందించాల్సి ఉందని సీఎస్ స్పష్టం చేశారు. గత ఏడాది డిసెంబరు లో జరిగిన జాతీయ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను త్వరితగతిన అమలు చేయాల్సిందిగా సీఎస్ సూచనలిచ్చారు. జూలై మాసంలో నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరుగనున్న దృష్ట్యా, 117 అంశాలపై చర్యలు చేపట్టాల్సిందిగా సీఎస్ అధికారులను ఆదేశించారు.
తాగునీటి వనరులను జియోట్యాగింగ్: తాగునీటికి సంబంధంచిన అంశాలను పాఠ్యాంశాల్లో ఒక అధ్యాయంగా పెట్టాల్సిన అవసరం ఉందని, తద్వారా విద్యార్ధి దశ నుంచే నీటి పొదుపుపై అవగాహన పెరుగుతుందని సీఎస్ స్పష్టం చేశారు. అలాగే తాగునీటి వనరుల్ని జియోట్యాగింగ్ (Geotagging ) చేసి వాటిని సంరంక్షించే అంశంపై కూడా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. పగటి సమయంలో సౌర విద్యుత్ ద్వారా గ్రామాలకు రక్షిత మంచినీటి పథకాల ద్వారా నీటి సరఫరా కార్యక్రమాన్ని చేపట్టే అంశాన్ని కూడా త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని ఆదేశాలిచ్చారు. అదే సమయంలో వైద్యారోగ్య శాఖ పరంగా కొన్ని వ్యాధుల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని సీఎస్ జవహర్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.