Crops loss due to Krishna River Floods: కృష్ణా నది వరదలు ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల వెన్ను విరిచాయి. కృష్ణా పశ్చిమ డెల్టాలో ప్రధానంగా వరి పంట బాగా దెబ్బతింది. గుంటూరువాహిని, మురుగుకాలువలు, వాగులు ఉప్పొంగడంతో ఎక్కడికక్కడ గండ్లు పడి వరి పొలాల్ని ముంచెత్తింది. మెట్ట ప్రాంతంలో వాగుల ఉద్ధృతికి పత్తి, మిరపతోపాటు నువ్వులు, మినుము, పెసర, సోయాబీన్ వంటి పంటలూ నీటమునిగాయి. లంక గ్రామాల్లోనైతే ఒక్క పంటకూడా మిగల్లేదు. పెట్టుబడి మొత్తం వరదపాలై చిల్లిగవ్వ చేతికి రాని దయనీయ స్థితి.
బాపట్ల జిల్లా వ్యాప్తంగా 38 వేల హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వరి, అరటి, పసుపు, కంద, నిమ్మ, జామ ఇలా ఏ పంటా చేతికి వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ వచ్చినా దిగుబడులు దిగజారిపోవడం ఖాయమని రైతులు దిగాలుచెందుతున్నారు. లంక గ్రామాల్లో అరటి చెట్లు నేలవాలాయి. పల్నాడు జిల్లాలో 11 వేల 288 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. మిర్చి, వరి పంటలు ఆరంభ దశలోనే దెబ్బతిన్నాయి.
రైతుల ఆశలపై నీళ్లు చల్లిన బుడమేరు వరద - నీట మునిగిన వేలాది ఎకరాలు - Heavy crop loss due to Budameru
వరద తగ్గగానే పొలాల్లోని నీళ్లు డ్రెయిన్ల ద్వారా బయటకుపోతాయని రైతులు ఆశించినా, మళ్లీ కురుస్తున్న వర్షాలు ఆందోళనలోకి నెడుతున్నాయి. గత ప్రభుత్వం డ్రెయిన్లను బాగుచేసి ఉంటే ఇంత నష్టం జరిగేదికాదని రైతులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, అధికారులు పంట నష్టం అంచనాల్లో నిమగ్నమయ్యారు. తాడేపల్లి, మంగళగిరి, కొల్లిపర మండలాల్లో వరద నష్టం ఎక్కువగా ఉందని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్వా చెప్పారు.
"కంద 2 ఎకరాలు, పసుపు రెండు ఎకరాలు, బొప్పాయి ఒక ఎకరాలో పెట్టాము. అయిదు ఎకరాలను కౌలు చేస్తున్నాను. ఎకరాకి 50 వేల రూపాయలు ఇస్తున్నాను. వర్షాల వల్ల మొత్తం పోయింది. పెట్టుబడి చాలా పెట్టాము. ప్రభుత్వం మమ్మల్ని ఎంత త్వరగా ఆదుకుంటే, అంత త్వరగా మేము ఒడ్డెక్కుతాము". - రైతు
"ముడున్నర ఎకరాల బొప్పాయి వేశాను. పంట చేతికొచ్చే సమయానికి వరద వచ్చి మొత్తం పోయింది. మరి ఇప్పుడు మేము ఎలా బతకాలో ఏం చేయాలో తెలియడం లేదు. మూడు లక్షల రూపాయల వరకూ పెట్టుబడి పెట్టాము. వర్షాల వల్ల చాలా నష్టపోయాము". - రైతు