CREDAI South Con 2024 event in Krishna District: సాధ్యమైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు ఆయనా కన్వెన్షన్ సెంటర్లో క్రెడాయ్ (కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా) సౌత్ కాన్ 2024 ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బిల్డర్స్ విచ్చేసారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2014 నుంచి 2019 వరకు ఎలాంటి అభివృద్ధి జరిగిందో మీ అందరూ చూశారని మంత్రి అన్నారు.
నిర్మాణ రంగానికి జగన్ హయాంలో కొంత ఇబ్బంది వచ్చిందని అన్నారు. అనుమతుల కోసం బిల్డర్లు ఎవరూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అనుమతులు ఇచ్చేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ తీసుకొస్తున్నామని వెల్లడించారు. మున్సిపల్ శాఖతో అన్ని శాఖల సాప్ట్వేర్లను అనుసంధానం చేస్తున్నామని మంత్రి తెలిపారు. బిల్డర్లు అన్లైన్లో అనుమతుల కోసం డబ్బులు చెల్లిస్తే అన్ని శాఖల అనుమతులు వచ్చేలా చేస్తామని పేర్కొన్నారు.
జీవో 16ని గతంలో తామే ఇచ్చామని ఇప్పుడు దానిని అమలు చేస్తామని తెలిపారు. సింగిల్ విండో అనుమతులకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం రూ. 60 వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా అమరావతి నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వచ్చి నెలల మాత్రమే అవుతుందని బిల్డర్స్ అర్థం చేసుకోవాలని కోరారు. బిల్డర్స్ లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అభివృద్ధివైపు నిర్మాణ రంగం: రాష్ట్రంలో నిర్మాణ రంగం గత ఐదేళ్లలో చాలా ఇబ్బందులు పడిందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఇప్పుడు చాలామంది నిర్మాణ రంగం వైపు చూస్తున్నారని అన్నారు. దేశ జీడీబీలో వ్యవసాయం తరువాత నిర్మాణ రంగానిదే స్థానమని వెల్లడించారు. అమరావతి రాజధాని నిర్మాణంతో రాష్ట్రంలోని నిర్మాణ రంగం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తే నిర్మాణ రంగంలో సమస్యలు, అభివృద్ధిపై చర్చకు అవకాశం ఉంటుందని తెలిపారు.
చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు అమరావతి అభివృద్ధిపై ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి వివరించారు అందుకే కేంద్రం అమరావతికి 15 వేల కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. జీఎస్టీలో ఉన్న కొన్ని ఇబ్బందులను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ చేసారు. బిల్డర్స్ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్, కేంద్ర అర్బన్ డెవలప్ మెంట్ మంత్రితో సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు.