CREDAI Hyderabad Property Show 2024 : హైదరాబాద్ మహానగరంలో జనాభా కోటి దాటిపోయింది. నగరం రోజు రోజుకూ విస్తరిస్తూ బాహ్యవలయ రహదారి దాటి బహుళ అంతస్థుల నిర్మాణాలు నిర్మితమవుతున్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నగరానికి వచ్చిన వారు ఇక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకుంటున్నారు. దీంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, విల్లాలకు డిమాండ్ పెరిగిపోయింది. 2050 సంవత్సరం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తోంది.
ఇందులో భాగంగా బాహ్య వలయ రహదారి, ప్రాంతీయ వలయ రహదారి మధ్య ప్రాంతాన్ని టౌన్‌షిప్‌ల వారీగా అభివృద్ధి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దీన్ని అందిపుచ్చుకునేలా స్థిరాస్తి రంగం వ్యాపారులు నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే నిర్మించిన బహుళ అంతస్థుల భవనాలు, విల్లాలు విక్రయిస్తున్నారు. స్థిరాస్తి రంగానికి మరింత ఊపునిచ్చేలా క్రెడాయ్(CREDAI) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోలో 100కు పైగా సంస్థలు తమ ప్రాజెక్టుల గురించి వివరిస్తున్నాయి.
"వినియోగదారుల అవసరాల దృష్టిలో ఉంచుకుని విల్లాల రూపకల్పన చేస్తున్నాము. నేడు ప్రతి ఒక్కరికి గ్రీనరీపై అవగాహన వచ్చింది. ఇంట్లోనే గార్డెనింగ్ డిజైన్‌తో అపార్ట్‌మెంట్ల రూపకల్పన చేశాము. అందుబాటు ధరల్లోనే ప్లాట్లను విక్రయిస్తున్నాము. అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి". - వెన్నెల, సన్‌షైన్ డెవలపర్స్
Hyderabad Realestate 2024 : బ్యాంకులు సైతం గృహ కొనుగోలుదారులను ఆకట్టుకునేలా స్టాళ్లు ఏర్పాటు చేసి రుణ సాయం, వడ్డీ గురించి వివరిస్తున్నాయి. స్థిరాస్తి సంస్థలన్నీ ఒకే చోట స్టాళ్లు ఏర్పాటు చేయడంతో నచ్చిన అపార్ట్‌మెంట్ లేదా విల్లాను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఏ ప్రాంతంలో ఎంత ధర ఉంది? ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేస్తున్నారు? ఎంత విస్తీర్ణంలో నిర్మించి ఇస్తున్నారు. చుట్టుపక్కల వాతావరణం ఏ విధంగా ఉందనే విషయాలను స్థిరాస్తి వ్యాపారసంస్థలు కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నాయి.
"ఈ ప్రాపర్టీ షో బాగుంది. వివిధ కన్‌స్ట్రక్షన్ కంపెనీల ప్లాట్ల వివరాలు ఒకేచోట ఉంచడం వల్ల సమయం ఆదా అవుతుంది. వివిధ ప్రాంతాలకు తిరగకుండా ఇక్కడే అన్ని వివరాలు తెలుకోవచ్చు". - విజిటర్
దీంతో ఇల్లు కొనాలనుకునే వాళ్లు ఎక్కడ కొనుగోలు చేయాలనుకునే నిర్ణయాన్ని సులభంగా తీసుకోగలుగుతున్నారు. నచ్చిన ప్రాంతంలో మెచ్చిన ఇంటిని ఈ ప్రాపర్టీషోలో ఎంపిక చేసుకోవచ్చని క్రెడాయ్ ప్రతినిధులు చెబుతున్నారు. నేటితో ప్రాపర్టీ షో ముగియనుంది.
"ఇక్కడికి వచ్చే కస్టమర్లకు రుణసదుపాయం గురించి వివరిస్తాము. వారి ఇన్‌కం సర్టిఫికేట్‌ను చూసి, ఎంత అమౌంట్‌కు వస్తుందో చెబుతాం. వడ్డీ రేట్లు తదితర అంశాలను క్లుప్తంగా వివరిస్తాము". - సుజీత్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ బరోడా
ఇంత ఎత్తైన భవనాలు ఎలా కడుతున్నారు? అధ్యయనానికి సిటీకి వచ్చిన దేశంలోని వేర్వేరు నగరాల బిల్డర్లు
రూ.50 వేల కోట్లతో లండన్ థేమ్స్ రివర్ తరహాలో మూసీ నది డెవలప్మెంట్ : సీఎం రేవంత్ రెడ్డి