CRDA Officials Blocked the Movement of Construction Materials in Amaravati : రాజధానిలో రోడ్లు తవ్వుకుపోతున్నా ఏమాత్రం స్పందన లేదు. రైతులకు కేటాయించిన ప్లాట్లలో మట్టి తీసుకెళ్తున్నా అడ్డుకునే ప్రయత్నాలు చేయలేదు. నిర్మాణాల నుంచి ఇనుప సామగ్రి దొంగలించుకెళ్తున్నా ఫిర్యాదు చేసిన పాపాన పోలేదు. ఉద్దండరాయునిపాలెంలోని ప్రధాని శంకుస్థాపన చేసిన స్థలంలో అమరావతి ప్రణాళిక నమూనాలను ధ్వంసం చేసినా ఉలుకూ పలుకూ లేదు. రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు వెంబడి వేయాల్సిన భారీ తాగునీటి పైపులను అనుమతి లేకుండానే గుత్తేదారు సంస్థ పట్టుకెళ్తున్నా సంబంధంలేనట్లు నటించారు. గత ఐదేళ్లలో ఇదీ సీఆర్డీఏ అధికారుల వ్యవహార శైలి.
అమరావతికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తుండడంతో సీఆర్డీఏ అధికారులు కూడా ఇందుకు తగ్గట్లే నడుచుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు మినహా మిగిలిన వాటిని పూర్తిగా గాలికొదిలేశారు. అలాంటి అధికారులు గురువారం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు. మందడంలోని నిల్వ కేంద్రం నుంచి ఎల్ అండ్ టీ సంస్థ వ్యాపారులకు విక్రయించిన సరకును ఆగమేఘాలపై వెనక్కి రప్పించి, యథావిధిగా అన్‌లోడింగ్ చేయించారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్న ప్రచారం ఉన్న సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఆయన స్పందించి ఇంజినీరింగ్ అధికారులను ఆగమేఘాలపై పంపించారు. ఓట్ల లెక్కింపు తేదీ దగ్గరపడుతుండడం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందన్న ప్రచారం అందరిలో ఎక్కువ ఉండడమే కారణంగా భావిస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే అమరావతికి పూర్వ వైభవం వస్తుందన్న సంకేతాలతో సీఆర్డీఏ అధికారులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.
అమరావతిలో భూగర్భ కేబుళ్లకు అమర్చే ప్లాస్టిక్ స్పేసర్లను ఎల్ అండ్ టీ సంస్థ దిల్లీకి చెందిన ఓ వ్యాపారికి తుక్కు కింద విక్రయించింది. గత ఆరేళ్లుగా వీటిని మందడం సమీపంలోని ఏజెన్సీ కేంద్రంలో నిల్వ ఉంచింది. నిరుపయోగంగా ఉన్న వీటిని తుక్కు కింద అమ్మింది. ఈ లోడ్‌తో కంటెయినర్ తరలిపోతోందని ఈటీవీ- ఈనాడు వెలుగులోకి తెచ్చాయి. ఈ కథనాలపై సీఆర్డీఏ అధికారులు తమ సహజ శైలికి భిన్నంగా స్పందించారు. గురువారం ఉదయం నుంచే ఉరుకులు పరుగులు పెట్టారు. సీఈ నుంచి ఏఈ వరకు అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్లాస్టిక్ స్పేసర్లు తీసుకెళ్లినట్లు గుర్తించారు. వెంటనే ఎల్ అండ్ టీ సంస్థ అధికారులతో మాట్లాడి తరలిన లోడ్‌ను తిరిగి వెనక్కి తెప్పించారు. సీఆర్డీఏతో చేసుకున్న ఒప్పందాన్ని ఎల్ అండ్ టీ ఉల్లంఘించినట్లు తేల్చారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో భూగర్భంలో కేబుళ్లు వేసే పనులను ఈ సంస్థ దక్కించుకుంది. పనులు పూర్తి అయిన తర్వాత చెల్లింపులు చేసేలా సీఆర్డీఏతో ఒప్పందం కుదిరింది. ఇది ఇంకా అమలులోనే ఉంది. పనులు ఇంకా పూర్తి కాలేదు. గుత్తేదారు అజమాయిషీలోనే సామగ్రి ఉండాలి. సీఆర్డీఏకు చెప్పకుండా సామగ్రిని తరలించకూడదు. ఈ నేపథ్యంలో బయలుదేరిన కంటెయినర్లను వెనక్కి రప్పించారు. ఇటీవల రాజధాని నుంచి మేఘా సంస్థ తరలించిన విద్యుత్తు కేబుళ్ల డ్రమ్‌ల సామగ్రి సీఆర్డీఏకు సంబంధించిన పని తాలూకూ కాదని గుర్తించారు. లైన్ల మార్చేందుకు గతంలో ఏపీ ట్రాన్స్‌కోతో మేఘా సంస్థ ఒప్పందం కుదర్చుకుంది. దీనిని ఇటీవల గుత్తేదారు సంస్థ రద్దు చేసుకున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు సీఎం కానున్నారు అన్నది విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీంతో సీఆర్డీఏలో ఇప్పటి వరకు అధికార వైఎస్సార్సీపీతో అంటకాగిన అధికారులు ఇక్కడి నుంచి బయటపడేందుకు దారులు వెతుక్కుంటున్నారు. రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల్లో వీరు అడ్డగోలుగా వ్యవహరించారు. కూటమి వస్తే తమకు ఇబ్బందులు తప్పవన్న ఆందోళనలో వీరు ఉన్నట్లు తెలిసింది. ఇటీవల ప్లానింగ్ విభాగంలోని ఓ అధికారి తన పలుకుబడిని ఉపయోగించి ఆగమేఘాలపై మరో శాఖకు వెళ్లిపోయారు. ఇదే ప్రయత్నాల్లో పలువురు అధికారులు ఉన్నట్లు సమాచారం.