CRDA Employees Demanding Bribe : రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన అన్నదాతలను కొంతమంది సీఆర్‌డీఏ ఉద్యోగులు జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు. రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయకుండా తిప్పించుకుంటున్నారు. ఏదో ఒక కారణం చూపిస్తూ వారాల తరబడి ప్రక్రియను సాగదీస్తున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం కొందరు ఉద్యోగులు లక్షల రూపాయల్లో లంచాలు డిమాండ్ చేస్తుండటంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. రిజిస్ట్రేషన్ కోసం అబ్బరాజుపాలెం గ్రామానికి చెందిన భోగినేని సుధీర్ అనే రైతు, కంప్యూటర్ ఆపరేటర్ అశోక్‌ల మధ్య డబ్బు డిమాండ్ చేస్తూ సాగిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తూ...
- అబ్బరాజుపాలేనికి చెందిన భోగినేని కోటేశ్వరావు అమరావతి భూసమీకరణలో ఎకరన్నర భూమి ఇచ్చారు. ఆయనకు సీఆర్‌డీఏ 1,500 చదరపు గజాల నివాస, 360 చదరపు గజాల కమర్షియల్ ప్లాట్లు కేటాయించింది. కోటేశ్వరావుకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కోటేశ్వరరావు, అతని కుమార్తె మృతి చెందడంతో, తనతో పాటు తన సోదరి కుమారుల పేర్లపై ప్లాట్లను బదిలీ చేయాలని రైతు కుమారుడు సుధీర్ సీఆర్‌డీఏ ఆఫీస్‌కి వెళ్లారు. రిజిస్ట్రేషన్ కోసం సుధీర్ సీఆర్డీఏలో అబ్బరాజుపాలెం, బోరుపాలెం గ్రామాల రిజిస్ట్రేషన్ పనులు చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ అశోక్‌ను సంప్రదించగా, అతడు లక్ష రూపాయల లంచం డిమాండ్ చేశారు. తర్వాత తనకు ఎంత ఇచ్చినా ఫర్వాలేదని తమ సర్ కోసం 50 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు. ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- తుళ్లూరుకు చెందిన మరో రైతు తన ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలంటూ అసలైన పత్రాలను సీఆర్‌డీఏ అధికారులకు ఇచ్చారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాలేదంటూ దాదాపు వంద రోజుల పాటు ఆఫీస్ చుట్టూ తిప్పుకొని ఇటీవల రిజిస్ట్రేషన్ చేశారు.
సీఆర్‌డీఏ పరిధి పునరుద్ధరణ - అమరావతితో పాటు సమీప ప్రాంతాలు సమగ్రాభివృద్ధి!
భారీగా డబ్బుల డిమాండ్: సీఆర్డీఏలో కిందిస్థాయి ఉద్యోగులు లంచాల కోసం రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు సీఆర్‌డీఏ కార్యాలయానికి వచ్చినప్పుడు వారికి లేనిపోని కారణాలు చెబుతూ ఆలస్యం చేస్తున్నారు. రిటర్నబుల్ ప్లాట్లను తల్లిదండ్రుల నుంచి కుమారులు, కుమార్తెలకు రిజిస్ట్రేషన్‌ను ఉచితంగానే చేసే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. కానీ తప్పుల సవరణలు, సమస్యాత్మక భూముల్లో ప్లాట్లు, కుటుంబసభ్యుల మధ్య వివాదాలపై ఆఫీస్‌కు వచ్చినప్పుడు సిబ్బంది ఏదో ఒక కారణం చూపుతూ, తర్వాత లంచాలు తీసుకొని ప్రక్రియ పూర్తిచేస్తున్నారు.
నత్తనడకన ప్రక్రియ: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి పునర్నిర్మాణంపై దృష్టిసారించింది. రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేసింది. రాజధానిలో ప్రస్తుతం ఎనిమిది యూనిట్ ఆఫీస్‌లు నడుస్తున్నాయి. వీటికి సీఆర్‌డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ రోజువారీ టార్గెట్లు నిర్దేశించారు. రోజూ 300 రిజిస్ట్రేషన్లు చేయాలని టార్గెట్ ఇచ్చారు. కానీ ఉద్యోగులు రోజుకు 100 రిజిస్ట్రేషన్లే చేస్తున్నారు. ఇంకా చేయాల్సిననవి 17452 ఉన్నాయి.
క్రిమినల్ చర్యలు, దర్యాప్తు కోసం సిఫార్సు: లంచం డిమాండ్ ఆడియో వైరల్ అవడంతో కంప్యూటర్ ఆపరేటర్ అశోక్‌ను సీఆర్‌డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ విధుల నుంచి తొలగించారు. కంప్యూటర్ ఆపరేటర్ అశోక్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తుళ్లూరు ఇన్‌స్పెక్టర్‌కు లేఖ రాశారు. దర్యాప్తు జరిపి ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఏసీబీ డీజీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ ఉదంతంలో కంప్యూటర్ ఆపరేటర్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? వారి పాత్ర ఏమిటి? వంటి అంశాలపైనా దృష్టి సారించాలని కమిషనర్ కాటంనేని భాస్కర్ ఆ లేఖలో కోరారు.