Court Seized RDO Office Property in Mancherial : తమకు రావాల్సిన పరిహారం కోసం గత 42 ఏళ్లుగా భూ నిర్వాసితులు పోరాటం చేయగా న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇవాళ కోర్టు సిబ్బంది మంచిర్యాల ఆర్డీవో కార్యాలయం ఆస్తులను జప్తు చేసింది. 1982లో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలో ఐటీడీఏ(ITDA) అధికారులు మల్బరీ ప్లాంటేషన్ కోసం భవన నిర్మాణానికి ప్రభుత్వపరంగా భూసేకరణ చేశారు. అప్పటి నిర్మల్ ఆర్డీవో భూసేకరణ అధికారి భూ నిర్వాసితులైన ఖాజా బేగం, అమీనా అజ్మీరా బేగం, మహమ్మద్ నజీరుద్దీన్కు చెందిన 22 ఎకరాల 27 సెంట్లు భూమిని సేకరించి ఐటీడీఏకు అప్పగించారు.
RDO Office Property Confiscated By Court Staff : ప్రభుత్వం ఇచ్చిన మార్కెట్ ధర నచ్చక ఎక్కువ ధర చెల్లించాలని కోరుతూ నిర్వాసితులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై 42 ఏళ్లుగా ఆసిఫాబాద్, మంచిర్యాల కోర్టులలో వాదనలు జరిగాయి. 2017లో అప్పుడున్న జడ్జి నిజాముద్దీన్ భూ నిర్వాసితులకు ఎకరానికి రూ.33 వేల పరిహారం చెల్లించాలని తీర్పు ఇవ్వగా బాధితులు తమకు సరిపోదని ఎకరానికి 65 వేల రూపాయలను ఇవ్వాలని కోరారు. దీంత ఎకరానికి 48 వేల రూపాయలు చెల్లించాలని జడ్జి తీర్పు ఇచ్చారు. అయినా అధికారులు నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవడంతో భూ యజమాని మళ్లీ కోర్టును ఆశ్రయించారు.
రెండు కోట్ల 94 లక్షల రూపాయల పరిహారం : 2017లో ఇచ్చిన తీర్పు ప్రకారం నిర్వాసితులకు పరిహారం మూడు నెలల్లో చెల్లించాలని, లేకుంటే ఆర్డీవో కార్యాలయ ఆస్తులను జప్తు చేయాలని అక్టోబర్ 2023లో అప్పటి జడ్జి పి.ఉదయ్ కుమార్ తీర్పునిచ్చారు. న్యాయస్థాన తీర్పు ప్రకారం రెవెన్యూ అధికారులు గడువులోగా పరిహారం ఇవ్వడంలో జాప్యం చేయగా మళ్లీ భూ నిర్వాసితులు కోర్టును ఆశ్రయించారు. భూ నిర్వాసితులకు వెంటనే రెండు కోట్ల 91 లక్ష రూపాయలు చెల్లించాలని, లేకుంటే ఆర్డీవో కార్యాలయ ఆస్తులను జప్తు చేయాలని ప్రస్తుత జడ్జి అర్పిత మారం రెడ్డి అటాచ్డ్ వారెంట్ జారీ చేశారు.
No Compensation For Land - RDO Office Seized : దీంతో మంచిర్యాల ఆర్డీవో కార్యాలయం ఆస్తులను జప్తు చేయడానికి నిన్న కోర్టు సిబ్బంది వెళ్లగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోశ్ కొంత గడువు ఇవ్వాలని కోరారు. తాజాగా కోర్టు సిబ్బంది మళ్లీ ఇవాళ మంచిర్యాల ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని కంప్యూటర్లు, ప్రింటర్లు, ఆర్డీవో ఛాంబర్ ఫర్నిచర్ తరలించి జప్తు చేశారు. న్యాయస్థానం న్యాయం చేసిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దొంగలున్నారు జాగ్రత్త - భాగ్యనగర వాసులను కలవరపెడుతున్న వరుస చోరీలు - Robbery Incidents in Hyderabad
రామగుండం నగరాభివృద్ధి పనులు - సందిగ్ధంలో వ్యాపారుల జీవితాలు - GODAVARIKHANI ROAD EXPANSION Works