Counting Arrangements in Palnadu: ''పల్నాడు పేరు చెడగొట్టారు! ఇక్కడ కర్రలు, ఇనుపరాడ్లు పట్టుకుని రోడ్లపైన తిరుగుతుంటారని, ప్రత్యర్థులపై దాడులు చేస్తుంటారని దేశమంతటా ప్రచారమైంది! అన్ని ప్రాంతాల్లో పల్నాడులోని ఫ్యాక్షన్ గురించే మాట్లాడుకుంటున్నారు! ఇది మంచి పరిణామం కాదని'' స్పష్టం చేసిన ఎస్పీ మలికా గార్గ్ పోలింగ్ సమయంలో జరిగిన అల్లర్లు, దాడులకు భిన్నంగా కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలని అటు పార్టీ శ్రేణులకు, ఇటు ప్రజలకు పిలుపునిచ్చారు. శాంతిభద్రతల విషయంలో పల్నాడుపై ఉన్న అపఖ్యాతిని చెరిపేసేందుకు సహకరించాలని కోరారు.
పల్నాడు జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలైన మాచర్ల, గురజాల, నరసరావుపేట సహా వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో ఎస్పీ మలికాగార్గ్ ప్రత్యేక బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ సహా 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి అల్లర్లు, దాడులకు పాల్పడ్డవద్దని హెచ్చరించారు. 5వ తేదీ ఉదయం వరకు దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక: అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే నాకాబందీ పేరిట జిల్లాలోని 34 స్టేషన్ల పరిధిలో పోలీస్ బలగాలతో వాహనాలు, అనుమానాస్పద ప్రాంతాల్లో క్షుణంగా తనిఖీలు నిర్వహించారు. 465 బైక్‌లు, 6 ఆటోలు, 3 కార్లు సీజ్ చేశారు. లాడ్జీలు, కల్యాణ మండపాలు, వసతి గృహాల్లో సోదాలు చేశారు. పోలింగ్ వేళ పల్నాడు ఒకప్పటి బిహార్‌లా మారిందన్న ఎస్పీ, జిల్లాలోని సమస్యాత్మక గ్రామాలకు చెందిన నాయకులతో సమావేశమై ఎలాంటి ఘర్షణలకు పాల్పడ్డవద్దని హెచ్చరించారు.
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నరసరావుపేటలోని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా చేపట్టేందుకు అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఎవరైనా హింసాత్మక ఘటనలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
చిలకలూరిపేట నుంచి తొలి ఫలితం వెలువడే అవకాశం: పల్నాడు జిల్లాలోని నరసరావుపేట సమీపంలో కాకాని వద్ద ఉన్న జేఎన్టీయూలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభంకానుంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 చొప్పున టెబుళ్లు ఏర్పాటు చేశారు. మెుత్తం 700 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనున్నారు. జిల్లాలో చిలకలూరిపేట నుంచి తొలి ఫలితం వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే విధంగా గురజాల నియోజకవర్గం నుంచి తుది ఫలితం వెల్లడి కానుంది. కౌంటింగ్ రోజు దాడులు, అల్లర్లు, ఘర్షణలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.