High Court Issue The Notice to Collectors : తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల విషయంలో కోర్టుకు హామీ ఇచ్చిన గడువులోగా పరిహారం చెల్లించకపోవడంతో నలుగురు కలెక్టర్లపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆత్మహత్య చేసుకున్న రైతులకు చెల్లించే పరిహారం పరిశీలనలో ఉందని ప్రభుత్వం చెప్పినా, అది అమలు కాకపోవడంతో ఓ సామాజిక కార్యకర్త కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
ఆత్మహత్యలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) విచారణ సందర్భంగా ఆయా జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు చెందిన కుటుంబాల వివరాల పరిశీలన జరుగుతోందని 4 నెలల్లో చెల్లిస్తామంటూ గత ఏడాది నవంబరులో ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. కానీ 2023 నవంబరు పోయి సరిగ్గా సంవత్సరం దాటింది. అయినా ఆ కుటుంబాలకు ఇప్పటి వరకు పరిహారం చెల్లించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
కలెక్టర్లకు నోటీసులు : దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె. అనిల్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పరిహారానికి సంబంధించిన దరఖాస్తులను ముగ్గురు సభ్యుల కమిటీ పరిశీలిస్తోందని గత ఏడాది నవంబరులో ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణను హైకోర్టు మూసివేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ కోర్టుకు తెలిపారు. అయితే ఏడాది దాటినా ఇప్పటికీ బాధిత కుటుంబాలకు పరిహారం అందలేన్నారు. వాదనలను విన్న ధర్మాసనం వెంటనే ఆయా జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై కోర్టు ధిక్కరణ కింద ఈ పిటిషన్‌ను ఎందుకు స్వీకరించకూడదో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
రాంగోపాల్‌వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట - షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు