Contaminated Food Causes 23 Girl Students Sick In Kakinada District : కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాల విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషాహారం తిని 23 మంది విద్యార్థినులు ఆస్పత్రిపాలయ్యారు. కలుషితాహారమే అస్వస్థతకు కారణమని వైద్యులు చెప్పారు. బాలికలు ప్రస్తుతం ఏలేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన తనను ఆందోళనకు గురి చేసిందని రాష్ట్ర విద్య శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని విద్య, వైద్య శాఖల అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇటీవలే తిరుపతి జిల్లా ఎల్‌ఏ సాగరం అంబేడ్కర్ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఇటువంటి ఘటనే చోటు చేసకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిల్వ ఉన్న ఆహారం తిని 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పిల్లలు తీవ్ర వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ నెల 19న అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రమంలో సమోసా తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో సోమవారం ముగ్గురు మృతి చెందడం అందర్ని కలిచివేసింది.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం అరట్లకోటకు చెందిన పాస్టర్ ముక్కుడుపల్లి కిరణ్‌కుమార్ కోటవురట్ల మండలం కైలాసపట్నం లోని విద్యుత్తు ఉప కేంద్రం సమీపంలో చిన్న రేకుల షెడ్‌లో ఓ ప్రార్థనా మందిరం నడుపుతున్నారు. పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ (పాస) పేరుతో ఓ అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు.అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతంలో పరిచయస్తులైన పాస్టర్ల ద్వారా విశ్వాసకులతో మాట్లాడి వారి పిల్లలను ఆశ్రమంలో చేర్పించుకున్నారు. ఈ క్రమంలో అక్కడ చేరిన అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరో 35 మందికి పైగా పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.