Construction of Bhadradri Ram temple in Atlanta city USA : ఆళ్లగడ్డ శిల్పుల కీర్తి ఖండాంతరాలు దాటుతోంది. వారి చేతుల్లో రూపుదిద్దుకున్న శిల్పాలు మన రాష్ట్రం, ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికా వరకు ప్రతిష్ఠకు సిద్ధమవుతున్నాయి. వారి చేతుల్లో రూపుదిద్దుకున్న దేవతామూర్తుల విగ్రహాలకు ఇతర దేశాల్లోనూ పూజాధికాలు అందుకుంటున్నాయి. 40 ఏళ్ల కిందటే అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో ఆళ్లగడ్డ శిల్పుల చేతిలో రూపుదిద్దుకున్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం పూజలందుకుంటోంది.
ఇప్పటికీ ఆ దేశంలో అత్యంత అందమైన, ఆహ్లాదకరమైన ఆలయాల్లో ఇదొకటిగా పేరు తెచ్చుకొంది. అయోధ్య రామాలయం, తెలంగాణలోని యాదాద్రి ఆలయం, నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధవనం ఇలా ఎన్నో ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాల్లో ఆళ్లగడ్డ శిల్పుల చేతిలో రూపుదిద్దుకున్న శిల్పాలు ప్రజల్ని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఆళ్లగడ్డకు చెందిన బాలసుబ్రమణ్యం అనే శిల్పి ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న భద్రాద్రి రామాలయం అమెరికాలో ఏర్పాటు కానుండటం ఇక్కడి వారికి ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే బాలసుబ్రహ్మణ్యం కేంద్ర ప్రభుత్వ సహకారం కోరుతూ కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బి.సంజయ్‌లను కలసి వినతిపత్రాలు అందించారు.
అట్లాంటాలో ప్రతిష్ఠకు సన్నాహాలు : అట్లాంటా నగరంలో భద్రాచలంలోని రామాలయం నమూనాను పోలిన భద్రాద్రి రామాలయాన్ని ఆమెరికాలోని ఆలయ ట్రస్టు బృందం నిర్మించతలపెట్టింది. ఈ మేరకు ఈ బృంద సభ్యులు ఆళ్లగడ్డకు వచ్చిన ఆలయ నిర్మాణ బాధ్యతలను స్థానిక శిల్పి దురుగడ్డ బాలసుబ్రహ్మణ్యానికి అప్పగించారు. ఈ బృహత్తర బాధ్యతను ఆయన భుజానికి ఎత్తుకుని ప్రతిభ కల్గిన శిల్పుల సహకారంతో 2022 డిసెంబరులో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆళ్లగడ్డలోనే ఆలయ నిర్మాణంలో ఉపయోగించే శిల్పాలను తయారు చేయడం ప్రారంభించారు.
ఇందుకోసం గుంటూరు పరిధిలో లభ్యమవుతున్న కృష్ణశిలను వినియోగించారు. ప్రధానశిల్పిగా బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మరో 100 మంది నిపుణులు కలిసి ఆలయ నిర్మాణంలో పాల్గొన్నారు. ఈ ఏడాది మే నెలలో ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో శిల్పాలను ఆమెరికాకు తీసుకెళ్లి ఆలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. పూర్తిగా ఓడలను రవాణాకు ఉపయోగించి దాదాపు 100 కంటైనర్లలో శిల్పాలను తరలించనున్నారు. రవాణాలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో ఆమెరికా ఆలయ ట్రస్టు సభ్యులు, ప్రధాన శిల్పి గురువారం కేంద్ర మంత్రులను దిల్లీలో కలిసి వినతిపత్రం అందించారు. వచ్చే ఏడాది శ్రీరామనవమికి ఈ ఆలయ ప్రతిష్ఠ జరగనుందని, ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీని కూడా ట్రస్టు సభ్యులు ఆహ్వానించనున్నారు.
నాడు తాత నేడు మనవడు : 40 ఏళ్ల కిందట ఆమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో బాలసుబ్రహ్మణ్యం తాత దురుగడ్డ బాలవీరాచారి, ఆయన కుమారులు పాల్గొన్నారు. వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ బాలసుబ్రహ్మణ్యం భద్రాద్రి ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. నాడు తాత అమెరికాలో ఆలయ నిర్మాణంలో పాల్గొనగా 40 ఏళ్ల తర్వాత ఆయన మనవడు బాలసుబ్రహ్మణ్యం ఆమెరికాలో పూర్తిస్థాయిలో భద్రాద్రి రాముడి ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్నారు.
వావ్.. న్యూస్పేపర్స్తో అందమైన శిల్పాలు.. 'జానకి రామ్' టాలెంట్ అదుర్స్!