Construction National Highway - 16 Near By Amaravati : రాజధాని అమరావతిని కలుపుకొంటూ జాతీయ రహదారి విస్తరణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) రూపొందించిన ప్రణాళికతో మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు కలెక్టరేట్‌లో గురువారం జాతీయ రహదారుల పనులపై అధికారులతో మంత్రి సమీక్షించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే హైవే-16 అభివృద్ధి ప్రణాళిక బాగుందని కితాబిచ్చారు.
వినుకొండ - గుంటూరు రెండు లైన్ల మార్గాన్ని 4 లైన్లుగా విస్తరించి మరో 25 కిలోమీటర్లు పొడిగిస్తూ, రాజధాని అమరావతిని తాకేలా ప్రణాళిక రూపొందిందని తెలపారు. ఈ జాతీయ రహదారి రాజధాని ప్రాంత అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. గుంటూరుకు మరో ఔటర్ రింగ్ రోడ్డులా మారుతుందని, దీన్ని పూర్తిగా ఎన్‌హెచ్‌ఏఐ నిర్మిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూసేకరణ, విద్యుత్తు తదితర పనులు వెంటనే చేపట్టాలని సూచించారు. రెండు సంవత్సరాల్లో హైవే నిర్మాణం పూర్తవుతుందని ఆయన వివరించారు. ఈ సమీక్షలో కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, బూర్ల రామాంజనేయులు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పాల్గొన్నారు.
రైతులను మోసగించిన వారిపై కఠిన చర్యలు : నకిలీ పత్రాలు సృష్టించి అన్నదాతల పేరిట రుణాలు తీసుకుని మిర్చి రైతుల్ని మోసం చేసిన కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి రైతులు మిర్చిని గుంటూరుకు తీసుకువచ్చి, మంచి ధర కోసం శీతల గోదాముల్లో దాచుకుంటే ఓ కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు మోసానికి పాల్పడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపోయిన రైతులందరూ కన్నీరు పెట్టుకుని రావడం బాధనిపించిందని అన్నారు.
మిర్చి రైతులను మోసం చేసి వారిని అరెస్ట్ చేశామన్న కేంద్ర సహాయ మంత్రి కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకుల ఆస్తులను కూడా ఎటాచ్ చేసేందుకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. రైతుల్ని మోసం చేయడమే కాకుండా కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు కావాలనే ఆత్మహత్య నాటకానికి తెర తీశారని మండిపడ్డారు. ఆసుపత్రి వర్గాలను సైతం అలాంటి వారికి సహకరించవద్దని హెచ్చరించారు. రుణాలు తీసుకుని మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వాహనదారులకు గుడ్ న్యూస్ - ఆరు వరసలుగా ఆ రహదారి విస్తరణ - Hyderabad Vijayawada Highway
ఏపీలో రహదారులకు త్వరలో మోక్షం- గోతులు పూడ్చటానికి టెండర్లు - National highway widening works