Tulasi Reddy Comments on YS Jagan Security: వైఎస్ జగన్ రెడ్డికి 59 మంది గన్ మెన్లు సరిపోరా అంటూ ఏపీసీసీ మీడియా ఛైర్మన్ తులసి రెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం జగన్‌కు 59 మంది గన్మెన్లను ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. అయినా కూడా తనకు 139 మంది గన్మెన్లను ఇవ్వమని ప్రభుత్వాన్ని ఆదేశించండి అంటూ జగన్ హైకోర్టులో పిటిషన్ వేయడం హాస్యాస్పదంగా ఉందని తులసి రెడ్డి పేర్కొన్నారు. ఇది జగన్ పిరికితనానికి దర్పణం లాంటిదని అన్నారు. కడప జిల్లా వేంపల్లిలో తులసి రెడ్డి మీడియాతో మాట్లాడారు.
అసలు జగన్‌కు 59 మందిని సెక్యూరిటీగా ఇవ్వడమే తప్పు అని తులసి రెడ్డి అన్నారు. అందరి ఎమ్మెల్యేలు మాదిరిగానే జగన్ కూడా ఒక ఎమ్మెల్యే మాత్రమే అని పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యేకు 1+1గానీ, 2+2గానీ గన్మెన్లను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. కాబట్టి అదే విధంగా జగన్‌కు సైతం కల్పించాలని కోరారు. ప్రస్తుతం జగన్ ఎమ్మెల్యే మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
జగన్ 139 మంది గన్మెన్లను అడుగుతున్నది భద్రత కోసం కాదని, స్టేటస్, హంగూ ఆర్భాటం కోసం అని తులసి రెడ్డి అన్నారు. స్టేటస్ కోసం గన్మెన్లను ఇవ్వడం సరి కాదని తులసి రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుని హోదా కోసం జగన్ హైకోర్టులో పిటిషన్ వేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. నిబంధనల ప్రకారమే ప్రతిపక్ష హోదా ఇస్తారన్నారు.
ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వాలంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేల మొత్తం సంఖ్యలో 10 శాతం ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఉండాలని నిబంధనలు చెబుతున్నాయని తులసి రెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల సంఖ్య 11 మాత్రమే ఉందని, అందుకే ప్రతిపక్ష హోదా రాలేదని అన్నారు. వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి లాంటి వారు కేవలం ఎమ్మెల్యే హోదాలోనే రాణించలేదా అని ప్రశ్నించారు. చాక్లెట్ ఇస్తే బడికి పోతా, లేకుంటే పోను అని చిన్న పిల్లలు మారాము చేసినట్లుగా జగన్ వైఖరి ఉందని తులసి రెడ్డి ఎద్దేవా చేశారు.
సీఎం హోదాలో భద్రత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించిన జగన్ - jagan security petition