D Srinivas Funeral With State Honors : రాష్ట్ర రాజకీయాల్లో డీఎస్‌గా ప్రాచుర్యం పొందిన డి. శ్రీనివాస్ మరణించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శనివారం రోజున గుండెపోటు రాగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్, పలు మార్లు ఆస్పత్రిలో చేరారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ దురంధరుడిగా, తన వ్యూహాలతో చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్నారు. శనివారం మధ్యాహ్నం వరకు డీఎస్ మృతదేహాన్ని హైదరాబాద్ లోని నివాసంలో ఉంచారు.
పార్లమెంట్ సమావేశాల కోసం దిల్లీలో ఉన్న చిన్న కుమారుడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ వచ్చిన తర్వాత ఇందూరుకు తీసుకెళ్లారు. నగరంలోని నివాసంలో డీఎస్ పార్థివదేహాన్ని ఉంచగా, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, బంధువులు నివాళులు అర్పించారు. ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి సీఎస్‌కు ఆదేశాలు జారీ చేశారు. పలువురు మంత్రులు, కాంగ్రెస్ జాతీయ నాయకులు, బీజేపీ జాతీయ నాయకులు నివాళులు అర్పించనున్నారు.
పార్ఠీవ దేహంపై కాంగ్రెస్ జెండా.. పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ మృతి కాంగ్రెస్ పార్టీకి, బలహీన వర్గాలకు తీరని లోటని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. డీఎస్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. డీఎస్ కుమారులు సంజయ్, అరవింద్‌లను పరామర్శించి, డీఎస్ చివరి కోరిక మేరకు ఆయనపై కాంగ్రెస్ జండా కప్పేందుకు అనుమతి తీసుకున్నారు. ఇద్దరు కుమారులు ఓకే అనడంతోపాటు ఆయన కాంగ్రెస్ మనిషేనని స్పష్టం చేయడంలో అప్పటికే సిద్దంగా ఉంచుకున్న కాంగ్రెస్ జండాను కప్పారు.
అధికార లాంఛనాలతో నేడు నిజామాబాద్‌లో ప్రభుత్వ లాంఛనాలతో డీఎస్‌కు అంత్యక్రియలు జరపనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. నిజామాబాద్‌లో మ.12 గంటలకు డీఎస్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ప్రగతినగర్‌లోని నివాసం నుంచి కంఠేశ్వర్, బైపాస్ రోడ్డు మీదుగా అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. ఇప్పటికే బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల, కేంద్ర సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లోని ఇంటి వద్ద పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. రాజకీయ చతురత కలిగిన నాయకుడని బండి సంజయ్ కొనియాడారు.
కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ కన్నుమూత- పలువురు నాయకుల సంతాపం - tributes to dharmapuri srinivas
రేపు డీఎస్ అంత్యక్రియలు- నిజామాబాద్ వెళ్లనున్న సీఎం రేవంత్ - cm revanth tributes to ds