Congress Fact Finding Committee On Parliamentary Results : కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్న విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. అంచనాలు తలకిందులయ్యాయి. ఆశించిన సీట్లు ఎందుకు రాలేదన్న అంశంపై ఏఐసీసీ ఆరాతీయగా కొందరు నాయకులు సహకరించకపోవడంతో ఫలితాలు తారుమారైనట్లు తెలుస్తోంది.
రాష్ట్రాల వారీగా ఫలితాలను సమీక్షించిన ఏఐసీసీ ఆయా రాష్ట్రాల్లో సీట్లు తగ్గేందుకు గల కారణాలను అన్వేషించేందుకు నిజనిర్ధారణ కమిటీలను వేసింది. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిషా, దిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణకి నిజనిర్దారణ కమిటీలను అధిష్ఠానం పంపింది. ఈ మేరకు నిజనిర్దారణ కమిటీ సభ్యులు పి.జె.కురియన్, రాకిబల్‌హుస్సేన్ హైదరాబాద్ చేరుకున్నారు.
తెలంగాణలో 14 పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలుస్తామన్న విశ్వాసంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉండగా కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. ఫలితాలు తగ్గడానికి బీజేపీకి, బీఆర్ఎస్ పూర్తిగా మద్దతివ్వడమే కారణమని పార్టీ రాష్ట్ర నాయకత్వం అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా ఏఐసీసీ తిరిగి నిజనిర్ధారణ కమిటీ వేసింది. ఆ కమిటీ టికెట్ల కేటాయింపు నుంచి ఎన్నికలయ్యే వరకు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆరా తీస్తుంది.
పోటీచేసిన అభ్యర్ధులతో నిజనిర్ధారణ కమిటీ : రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఎందుకు ఆశించిన ఫలితాలు రాలేదన్న భావన అధిష్టానంలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉదయం పదిన్నరకి గాంధీ భవన్‌లో రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్యర్ధులతో నిజనిర్ధారణ కమిటీ భేటీ అవుతుంది. తొలుత ఓడిన 9 మందితో ఆ తర్వాత గెలిచిన 8 మందితో వేర్వేరుగా సమావేశమై అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాయకుల సహకారంపై ఆరా తీయనున్నారు. ఇప్పటికే గాంధీభవన్ నుంచి 17 మంది అభ్యర్థులకు సమాచారం అందించడం సహా వారికి కేటాయించిన సమయం తెలియజేశారు.
ప్రధానంగా మహబూబ్‌నగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో ఫలితాలపై కమిటీ సభ్యులు ఆరాతీసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. టికెట్ల కేటాయింపులో జాప్యం, పట్టున్న వారికి కాకుండా ఇతరులకు టికెట్లు ఇవ్వడం, కొందరు నాయకులు పూర్తిస్థాయిలో ప్రచారం చేయకపోవడం వంటి అంశాలపై కమిటీ సభ్యులు ఆరా తీస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ స్థానాలతోపాటు అసెంబ్లీ నియోజక వర్గాల్లో సమన్వయం చేసిన కోఆర్డినేటర్లు అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు, పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ మంత్రులు, సీనియర్ నేతలను ఆ కమిటీ కలిసే అవకాశం ఉంది. రెండు రోజులు పాటు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో కమిటీ సభ్యులు సమావేశం అవుతారని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ ఇస్తే గెలిచేవాడిని : వీహెచ్ - Congress leader VH on Rajya Sabha