Comprehensive Family Survey Start In Telangana : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు తొలుత కుటుంబాలను గుర్తించే పనిలో ఉన్నారు. ఇంటింటికి వెళ్లి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో గుర్తించి స్టిక్కర్లు అతికిస్తున్నారు. ఈనెల 9న వివరాలు నమోదు చేస్తామని సమగ్ర కుటుంబ సర్వేలో ఏయే అంశాలు చెప్పాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో సర్వేను పర్యవేక్షిస్తూ సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తున్నారు.
85 వేల మంది సిబ్బందితో సమగ్ర ఇంటింటి సర్వే : 85 వేల మంది సిబ్బంది సమగ్ర ఇంటింటికి సర్వేలో పాల్గొంటున్నారు. తొలుత కుటుంబాల గుర్తింపు పూర్తైన తర్వాత ఈనెల 9 నుంచి 75 ప్రశ్నలతో కూడిన వివరాలు సేకరిస్తారు. కుటుంబాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల వివరాలను నమోదు చేస్తారు. ప్రధాన ప్రశ్నలు 56, ఉపప్రశ్నలు 19 కలిపి మొత్తం 75 ప్రశ్నలతో కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేస్తారు. కుటుంబ సభ్యుల పేర్లతో పాటు అందరి మొబైల్ నంబరు సేకరిస్తారు. కులంతో పాటు ఆ కులాన్ని ఇతర పేర్లతో పిలిస్తే వాటిని కూడా రాసుకుంటారు.
అధికారులు ఏయే వివరాలను సేకరిస్తారంటే? : కుటుంబ సభ్యుల వారీగా విద్య, చదివిన మాధ్యమం, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, వార్షికాదాయం తెలుసుకుంటారు. కుటుంబానికి ఉన్న భూములు, ఇళ్లు, ఇతర స్థిర, చరాస్తుల వివరాలు సేకరిస్తారు. ఇప్పటి వరకు విద్య, ఉద్యోగాల్లో పొందిన రిజర్వేషన్ ప్రయోజనాలు గత ఐదేళ్లుగా పొందిన ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది, తీసుకున్న రుణాలు, వాటిని దేని కోసం ఉపయోగించారన్న అంశాలు సైతం అడుగుతారు. విదేశాలు లేదా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారా అనే అంశాలపై కూడా అధ్యయనం జరగనుంది. సొంత ఇళ్లా? అద్దెకు ఉంటున్నారా? ఇంట్లో ఫ్రిజ్, కారు, ద్విచక్రవాహనం, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ వంటివి ఉన్నాయా అనే వివరాలు అడిగి ఫారంలో నింపుతారు. దీనికి సంబంధించి ఆధార్, రేషన్‌కార్డు, భూసంబంధ వివరాలను ప్రజలు దగ్గర ఉంచుకోవాలని వారు సూచిస్తున్నారు.
సేకరించిన డేటాతో ప్రయోజనాలెన్నో : ప్రజల నుంచి సేకరించిన వివరాలను గోప్యంగా ఉంచాలని ఎన్యుమరేటర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది. వివరాలన్నీ ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు ప్రణాళిక శాఖకు పంపిస్తారు. ఈ నెలాఖరు వరకు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలు, రాజకీయ, విద్య, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేసేలా ఈ డేటాను వినియోగించుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఎంత ఉండాలో ఈ డేటా ఆధారంగానే ఖరారు చేయనున్నారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో అడిగే ప్రశ్నలు ఇవే - ఆ పత్రాలన్నీ దగ్గర ఉంచుకోండి
'సమగ్ర కులగణన అన్ని పథకాలకు మెగా హెల్త్ చెకప్‌లా ఉపయోగపడుతుంది'