Collectors Inspection at Illegal Sand Mining in AP: రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు చర్యలకు ఉపక్రమించారు. పలు జిల్లాల్లోని ఇసుక రీచ్‌లను సందర్శిస్తూ వాస్తవ పరిస్థితులను నమోదు చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులపై విచారణ చేపట్టి త్వరలోనే సుప్రీం కోర్టుకు నివేదిక అందించనుట్లు కలెక్టర్లు వెల్లడించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు ఇసుక రీచ్‌లను కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ హెచ్చరించారు. ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేసిన ప్రాంతాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన రికార్డులను స్పష్టంగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. కొన్ని ఇసుక రీచ్ వద్ద సీసీ కెమెరాలు లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలు లేకుండా ఇసుక ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. వెంటనే కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇసుక రీచ్‌ల నుంచి రికార్డులను పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు.
ఏలూరు జిల్లా వెలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పర్యటించారు. ఆయా ప్రాంతాల్లోని ఇసుక రాంపులను పరిశీలించారు. కుక్కునూరు మండలాల్లోని రుద్రంకోట, దాచారం, వేలేరు గ్రామాల్లో ఇసుక ర్యాంపు లను పరిశీలించారు. ఎస్పీ మేరి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ సహా అధికారుల కమిటీ వేలేరుపాడు, జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు ఇసుక ర్యాంపులను పరిశీలించి సమగ్ర నివేదికను సుప్రీంకోర్టుకు అందించనున్నట్లు తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాలపై కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు ఇచ్చిన మధ్యంతర నివేదిక అందించింది. నివేదిక పరిశీలించిన సుప్రీం కోర్టు రాష్ట్రంలోని అన్ని ఇసుక ర్యాంపుల పరిస్థితులు పరిశీలించి పూర్తి నివేదిక ఇవ్వాలనే ఆదేశినట్లు కలెక్టర్ తెలిపారు. అందులో భాగంగానే జిల్లాలోని ఇసుక ర్యాంపులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
బాపట్ల జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం వద్ద గుండ్లకమ్మ నది పరీవాహక ప్రాంతాన్ని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. అక్రమ ఇసుక తవ్వకాలపై నివేదిక ఇవ్వాలన్న, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జేసీ చామకూరి శ్రీధర్ ఇసుక తవ్విన ప్రాంతాలను పరిశీలించారు. నిత్యం ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయా అని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే అక్రమ ఇసుక తవ్వకాలపై, నివేదిక తయారుచేసి సుప్రీంకోర్టుకు అప్పగిస్తామని జేసి వెల్లడించారు.
ఇదీ జరిగింది: రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు గురువారం నివేదిక అందజేసింది. నివేదిక పరిశీలించిన సుప్రీం కోర్టు, అన్ని రీచ్‌లను పరిశీలించి జులై 2 నాటికి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడా అక్రమ తవ్వకాల్లేవని గతంలో ఓసారి ఎన్జీటీకి కలెక్టర్లంతా ఒకేలా నివేదిక ఇచ్చి నవ్వులపాలయ్యారు. రీచ్‌లను మొక్కుబడిగా తనిఖీ చేసి అప్పట్లో నివేదిక ఇచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు నివేదిక కోరడంతో కలెక్టర్లు నిజాలను వెల్లడించక తప్పని పరిస్థితి ఏర్పడింది.