Collector Tears at International Children's Rights Day programme in Kakinada : ఆయన జిల్లా పాలనాధికారి. గురువుల వృత్తిధర్మం ఎంత గొప్పదో, నిబద్ధతతో పని చేయకపోతే భావితరాలకు ఎంత నష్టమో వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా కంటతడి పెట్టారు. కాకినాడ నగరంలో బుధవారం అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ సభ జరిగింది. ముఖ్య అతిథిగా కలెక్టర్ షాన్‌మోహన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు బాలలే బంగారు గనులని, వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సింది గురువులేనని తెలిపారు. కొంతమంది ఆ బాధ్యతను విస్మరిస్తున్నారంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఉపాధ్యాయులైన తన తల్లిదండ్రులు ఎంతో నిబద్ధతతో వృత్తి ధర్మాన్ని పాటించారు కాబట్టే తాము ఈ స్థాయిలో ఉన్నామని పేర్కొన్నారు. వారు సక్రమంగా విధులు నిర్వహించకపోయి ఉంటే ఆ పాపం తమకు తగిలేదన్నారు. ఈ సందర్భంలో ఆయన కంటతడి పెట్టారు.
ప్రచారంలో కన్నీటిపర్యంతమైన టీడీపీ అభ్యర్థి - Vemireddy Prashanthi Reddy
కొంతమంది 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని పాఠశాలలకు వెళ్లలేమని, దగ్గరలో పోస్టింగులు ఇప్పించాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాకు తెలిసిన వారితో సిఫార్సులు చేయించేవారన్నారు. అప్పుడు ఎంతో బాధపడేవాడిని, మరి కొందరు తామొక్కరిమే పాఠాలు చెప్పలేకపోతున్నామని, వేరేవారిని నియమించాలని, వైద్య ధ్రువపత్రాలతో నా వద్దకు వచ్చేవారని వివరించారు. ఉపాధ్యాయుల మధ్య చిన్న తగువులను సాకుగా చూపి, నచ్చిన చోటకు బదిలీ కోసం అడిగిన వారున్నారన్నారు.
ఏ ఉపాధ్యాయుడు వృత్తి ధర్మాన్ని పాటించరో వారు పిల్లల జీవితాలను నాశనం చేసినవారవుతారని హెచ్చరించారు. నిబద్ధతతో చేయకపోయినా, విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దకపోయినా ఆ పాపం తగులుతుందని పేర్కొన్నారు. ఇలాంటి సభల్లో తాను ఎక్కువగా మాట్లాడనని, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మాట్లాడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.