AP CM Jagan on Elections : మచిలీపట్నం ప్రచార సభలో ఏపీ సీఎం జగన్ నిరాశావాదాన్ని వినిపించారు. కూటమి నేతలు తనపై కుట్రలు పన్నుతున్నారని ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం లేదని ఆరోపించారు. అధికారులను ఇష్టం వచ్చినట్టు బదిలీ చేస్తున్నారని ఆక్రోశం వెలిబుచ్చారు. అమలులో ఉన్న పథకాలను ప్రజలకు అందకుండా చేస్తున్నారని ఆక్షేపించారు. ఇదంతా పేదలకు మంచి చేస్తున్న తనను లేకుండా చేయడానికేనని విమర్శించారు.
ఇక ఎప్పటిలాగే, ఏపీ సీఎం జగన్ రోడ్డుపై వెళ్లినా, గాల్లో వెళ్లినా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆయా ప్రాంతాల్లో ఏపీ సీఎం సభల కోసం ప్రజలను తరలిస్తున్న వైసీపీ నేతలు, వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. రోడ్డు షో అంటే విద్యుత్ కోతలు, భహిరంగ సభ అంటే ప్రయాణికులకు తిప్పులు తప్పడం లేదు. ఇక జనసమీకరణ కోసం డబ్బులు, మద్యం పంచుతూ ఎన్నికలను అపహాస్యంపాలు చేస్తున్నారు.
బహిరంగ సభకు మనిషికి రూ.300 : మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్నపేర్ని నాని, ఏపీ సీఎం బహిరంగ సభకు మనిషికి రూ.300లు ఇచ్చి ప్రజలను సభకు ఆటోలలో తరలించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే సభకు మధ్యాన్నానికే ప్రజల్ని తీసుకురావడంతో మండుటెండలో సభకు వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. జగన్ వచ్చిన వెంటనే సభాస్థలి నుండి ప్రజలు జారుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతుండగానే బహిరంగ సభ నుంచి ప్రజలు వెళ్లిపోయారు.
అంతకు ముందు, బాపట్ల జిల్లా రేపల్లెలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సిద్దం సభ నిర్వహించారు. ఈ సభ కోసం బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించారు. కానీ, వారికి కనీస వసతులు ఏర్పాటు చేయాడంలో వైసీపీ నేతలు విఫలమయ్యారు. దీంతో సభలో తొక్కిసలాట ఏర్పడింది. ఈ నేపథ్యంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సభలో తొక్కిసలాట జరిగి, ఓ మహిళ కాలుకు గాయమైంది. నడవలేని పరిస్థితిలో ఉన్న ఆ మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఎండ తీవ్రత తట్టుకోలేక ఇద్దరు వృద్దులు, ఇద్దరు యువకులు, ఓ మహిళా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఓ వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉండటంతో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక సభకు దూరంగా ఉన్న ప్రధాన రహదారులన్ని మూసి వేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ నియంత్రణ పేరుతొ పోలుసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వాహనదారులు నగరంలోకి రావడానికి అవస్థలు పడ్డారు.