Cm Revanth Reddy Review On Residential Schools : సర్కారు పాఠశాలలు, గురుకులాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సెమీ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యాశాఖను సీఎం ఆదేశించారు. అంగన్వాడీల్లో ప్లేస్కూల్ తరహాలో మూడో తరగతి వరకు బోధించేందుకు ప్రణాళికలు చేయాలన్నారు. అంగన్వాడీల్లో విద్యాబోధనకు అదనంగా మరో టీచర్‌ను నియమించాలని సూచించారు.
స్కూళ్లకు వెళ్లేందుకు రవాణా సదుపాయం : నాలుగో తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకునేలా ప్రణాళికలు చేయాలన్నారు. గ్రామాల నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం : కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ నమూనాలపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాలన్నీ ఒకే చోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం వేగంగా చేపట్టాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు 20 ఎకరాల్లో వీటిని నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకున్నాక ఒకట్రెండు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. ప్రభుత్వ నిధులతో పాటు సీఎస్ఆర్ నిధులు సేకరించి విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలన్నారు.
సమీకృత గురుకులాల నిర్మాణం : ముఖ్యమంత్రి సూచనల మేరకు సమీకృత గురుకులాల నిర్మాణం కోసం వారంలో డిజైన్లు సిద్ధం చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే డిజైన్ ఉండాలని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంపై వివిధ సంక్షేమ శాఖల అధికారులతో సచివాలయంలో సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో విశాలమైన తరగతి గదులు, ఆట స్థలాలు, తల్లిదండ్రులు పిల్లలను కలవడానికి ప్రత్యేక గది తదితర సదుపాయాలు ఉండాలన్నారు.
పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ సలహాదారుతో కమిటీని ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు. కమిటీలో సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి నోడల్ అధికారిగా, ఇతర సంక్షేమ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంండాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 49 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని అందులో ఈ ఏడాది ఎనిమిది పాఠశాలల పనులు ప్రారంభానికి సిద్ధమని తెలిపారు. మరో 31 పాఠశాలలకు ఇప్పటికే జిల్లా కలెక్టర్లు భూమిని గుర్తించారని మిగిలిన 10 పాఠశాలలకు కోసం భూమిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.