CM Revanth Reddy Review of HYDRA Procedures : హైదరాబాద్ సిటీ విస్తరణకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలను అందించేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్(హైడ్రా) రూపుదిద్దుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. హైడ్రా వ్యవస్థాగత నిర్మాణం, విధి విధానాలపై మరింత అధ్యయనం చేసి కసరత్తు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హైడ్రా ఏర్పాటు, సంబంధిత విధివిధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, విద్యుత్, పోలీసు విభాగాలను సమన్వయం చేసుకొని మరింత సమర్థంగా హైడ్రా పని చేసేలా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఇప్పుడున్న ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాన్ని అందుకు అనుగుణంగా పునర్ వ్యవస్థీకరించాలని ఆదేశించారు.
కొత్త విభాగంలో ఏయే స్థాయి అధికారులుండాలి, ఎంతమంది సిబ్బంది ఉండాలి ఏయే విభాగాలపై వీరిని డిప్యూటేషన్‌పై తీసుకోవాలి అనే అంశాలపై స్పష్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ వరకు 2వేల కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పని చేయాల్సి ఉంటుందని, పని విభజనకు వీలుగా సిటీలో ఇప్పుడున్న జోన్ల తరహాలో భౌగోళిక పరిధిని నిర్దేశించైలని సీఎం సూచించారు.
హైడ్రాకు ప్రత్యేక నిధులు కేటాయించాలి? : అవసరమైతే హైడ్రా(Hyderabad Disaster Response and Assets Monitoring and Protection)కు ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని సీఎం చెప్పారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ముసాయిదా తయారు చేయాలని స్పష్టం చేశారు. విపత్తుల నిర్వహణతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలగించటం, అక్రమ నిర్మాణాలు, నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలగింపు, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, విద్యుత్ సరఫరాలో హైడ్రా కీలకంగా వ్యవహరించేలా విధులు అప్పగించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
CM Revanth to Allocate Funds to Hydra : హెచ్ఎండీఏ, వాటర్ వర్క్‌లు, డిజాస్టర్ మేనేజ్మెంట్, మున్సిపల్ విభాగాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగింపు, అపరాధ రుసుము వసూలు బాధ్యతను హైడ్రాకు బదలాయించాలని అన్నారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినంగా ఉండేలా అధ్యయనం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలీ, జీహెచ్ఎంసీ ఈవీడీఎం కమిషనర్ రంగనాథ్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు.