Kshatriya Seva Samithi Congratulated To CM Revanth : రాజులు ఏ రంగంలో అడుగుపెట్టిన అక్కడ కచ్చితంగా రాణిస్తారని, అంత నిబద్ధతతో పనిచేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అభినందన సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ రాష్ట్రంలో ఐదు లక్షల జనాభా క్షత్రియులు ఉన్నట్లు క్షత్రియ సేవా సమితి సభ్యులు సీఎంకు వివరించారు.
అనంతరం క్షత్రియ భవనంతో పాటు క్షత్రియుల్లోని పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సీఎంను కోరారు. అలాగే తమకు రాజకీయాల్లోనూ అవకాశాలు కల్పించాలని కోరారు. దీనిపై సీఎం స్పందిస్తూ రాజ దర్పం ప్రదర్శించేలా అల్లూరి సీతారామరాజు పేరిట భవన నిర్మాణం చేపట్టాలని అందుకు ప్రభుత్వ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. విజయానికి, నమ్మకానికి క్షత్రియులు మారుపేరని రేవంత్‌రెడ్డి అన్నారు.
విజయానికి, నమ్మకానికి మారుపేరు క్షత్రియులు : రాజకీయాల్లో కూడా అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. తొలుత పార్టీలో అవకాశం ఇస్తామన్న ఆయన, తర్వాత ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తామని మాట ఇస్తున్నట్లు చెప్పారు. విశ్రాంత ఐఏఎస్ శ్రీనివాసరాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించామని ముఖ్యమంత్రి తెలిపారు. వారి ద్వారా క్షత్రియులు తనను కలవొచ్చని పేర్కొన్నారు.
"క్షత్రియ భవన్‌కు కావలసిన భూమిని అవసరమైన అనుమతులను కావలసిన విధంగా అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఒక్క అద్భుతమైన నిర్మాణాన్ని క్షత్రియ భవన్‌ను అద్భుతంగా మీరు నిర్మించండి. నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చే బాధ్యత నాది. రాజులలో కొంతమంది పేదవాళ్లు కూడా ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమంలో వారిని భాగస్వామ్యం చేస్తాం."-రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రభాస్ విశ్వవ్యాప్తం చేశారు : మీడియా, సినిమా రంగాల్లో రాజులదే పై చేయి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు బాహుబలితో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రభాస్‌ను గుర్తు చేశారు. ప్రభాస్ లేకుండా బాహుబలి లేదని కితాబిచ్చారు. ఫ్యూచర్ సిటీలో రాజులు పెట్టుబడులు పెట్టాలని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి ఒక ఫైటర్ అని కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఆయన మాటిస్తే తప్పకుండా నిలబడతారని క్షత్రియ సమాజానికి తెలిపారు. అంతకుముందు వందేమాతరం శ్రీనివాస్, గీతామాధురి, హనుమాన్లు వాళ్ల పాటలతో అలరించారు. పారిశ్రామికవేత్త అల్లూరి సీతారామరాజుతో పాటు ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన అందరికీ క్షత్రియ సేవా సమితి సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.