CM Revanth Orders to Start BC Caste Census in Telangana : బీసీ కుల గణన 60 రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బీసీ కుల గణన నిర్వహించే సర్వే బాధ్యతలను ప్రణాళిక శాఖకు ముఖ్యమంత్రి అప్పగించారు. ఈ క్రమంలో బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో బీసీ కుల గణనపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
బీసీ సామాజిక, ఆర్థిక కుల సర్వేపై బిహార్, కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాలు అనుసరించిన విధానాలను అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. సర్వే చేపట్టేందుకు అవసరమైన యంత్రాంగం తమ వద్ద లేదని, ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ కోరారు. బీసీ కమిషన్ ఛైర్మన్ వినతి మేరకు సర్వే బాధ్యతలు రాష్ట్ర ప్రణాళిక విభాగానికి కేటాయిస్తున్నట్లు సీఎం తెలిపారు. బీసీ కమిషన్, రాష్ట్ర ప్రణాళిక విభాగానికి సమన్వయకర్తగా ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎస్ శాంతికుమారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
సర్వే పూర్తయిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు : అరవై రోజుల్లో బీసీ సామాజిక, ఆర్థిక సర్వే పూర్తి చేసి డిసెంబరు 9లోపే నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీసీ సర్వే పూర్తయితే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లొచ్చునని అన్నారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, న్యాయ శాఖ కార్యదర్శి తిరుపతి, సీఎంవో అధికారులు మాణిక్ రాజ్, షానవాజ్ ఖాసీం, అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మూడు నెలల్లో బీసీ కులగణన చేయాలన్న హైకోర్టు : గత నెల సెప్టెంబరులో బీసీ కులగణన 3 నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఆ కులగణన పూర్తి చేసి నివేదికను సమర్పించాలని సూచించింది. 2019లో ఎర్ర సత్యనారాయణ అనే వ్యక్తి బీసీ కులగణన చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారించిన హైకోర్టు సీజే ధర్మాసనం మూడు నెలల్లో బీసీ కులగణన మూడు నెలల్లో చేయాలని ప్రభుత్వానికి ఆదేశిస్తూ పిటిషన్పై విచారణను ముగించింది.
3 నెలల్లో బీసీ కులగణన చేయండి - ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం - caste census in Telangana