CM Revanth Reddy Inaugurated Bio Asia 2024 at Hyderabad : హైదరాబాద్ హెచ్ఐసీసీ(HICC)వేదికగా 21వ బయో ఆసియా సదస్సును పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బుధవారం ముగియనున్న సదస్సులో జీవవైవిధ్యం, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులపై చర్చించనున్నారు. ఫార్మారంగ రాజధానిగా ఉన్న హైదరాబాద్ మరిన్ని అవకాశాలను కల్పిస్తోందని సీఎం రేవంత్(CM Revanth) తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ, స్టార్టప్ కంపెనీలకు తమ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్న ఆయన ఎంఎస్ఎంఈ(MSME)లను పటిష్ఠం చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని చెప్పారు.
ఏడాదికి 5 కోట్ల వ్యాక్సిన్ల తయారీ సామర్ధ్యం గల ఉత్పత్తి కేంద్రాన్ని బయోలాజికల్-ఈ తో కలిసి జపాన్ సంస్థ తకేడా(Takeda)హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోందని రేవంత్ ప్రకటించారు. ఆకాశమే తమ లక్ష్యమైతే తాము అక్కడికి తీసుకెళ్లడానికి రాకెట్‌తో సిద్ధంగా ఉన్నామని ఫార్మా కంపెనీలకు రేవంత్ భరోసా కల్పించారు. 300 ఎకరాల స్థలంలో రూ. 2 వేల కోట్ల పెట్టుబడితో జినోమ్ వ్యాలీ తదుపరి విస్తరణను చేపట్టబోతున్నామని ప్రకటించారు. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో పది ఫార్మా విలేజ్‌లను ప్రారంభించబోతున్నట్లు తాము ఇటీవలే ప్రకటించామని, ఈ ఫార్మా విలేజ్ వల్ల మౌలిక వసతుల పెరుగుదలతో పాటు ఉపాధి లభిస్తుందని అన్నారు. పారిశ్రామికవేత్తలకు అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
Minister Sridhar Babu about Genome Valley : కొత్తగా 5 లక్షల ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఈ విలేజ్ ఏర్పాటులో భాగంగా మూడు గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేడెట్ క్లస్టర్లను గుర్తించామని సీఎం రేవంత్ తెలిపారు. వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో మూడు ఫార్మా విలేజ్‌లను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ రూ. 40 వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar) అన్నారు. కొత్త ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లైఫ్‌సైన్సెస్‌కు కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నట్లు తెలిపారు. లైఫ్ సైన్సెస్ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని, ఈ రంగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పారు.
లైఫ్‌సైన్సెస్ రంగానికి ప్రోత్సాహకాలతో పాటే ఓ నూతన పాలసీని తీసుకురాబోతున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ పాలసీ టెక్నాలజీ, లైఫ్‌సైన్సెస్(Life Sciences), ఫార్మారంగం, రెగ్యులేటరీ ఏజెంట్ల మధ్య సమ్మేళనంగా ఉంటుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సమర్థమైన, వ్యాపార అనుకూల లైఫ్‌సైన్సెస్ పాలసీని, రాబోయే కొన్ని నెలల్లో ఆవిష్కరించబోతున్నామని వెల్లడించారు. బయో ఆసియా సదస్సులో భాగంగా జీనోమ్ వ్యాలీ ఎక్సెలెన్స్ పురస్కారాన్ని ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్ పురస్కార విజేత ప్రొఫెసర్ గ్రెగ్ సెమెన్జాకు ముఖ్యమంత్రి అందించారు.
'నేను ఇటీవల ఫార్మారంగ ప్రతినిధులను కలిసి వారు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి తెలుసుకున్నా. వారందరీకి అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను. మూడున్నర ఎకరాల్లో 2 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో జీనోమ్ వ్యాలీ విస్తరణ చేపట్టబోతున్నాం.'-రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
'ఫార్మాకు సంబంధించి హైదరాబాద్ గత 30-40 సంవత్సరాల నుంచి ప్రధాన క్యాపిటల్‌గా ఉంది. దేశంలోనే 40 శాతం ఫార్మాకు సంబంధించిన ప్రొడక్ట్స్‌ని ఇక్కడ డెవలప్ చేయడంగా ఫార్మా క్యాపిటల్‌గా ఉంది.'-శ్రీధర్‌బాబు, పరిశ్రమల శాఖ మంత్రి
ఆకాశమే మీ లక్ష్యమైతే - అక్కడికి తీసుకెళ్లడానికి మేం రాకెట్‌తో సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి
సంస్కరణల బాటలో విశ్వవిద్యాలయాలు - ప్రక్షాళన వైపు ప్రభుత్వ అడుగులు