78th Independence Day Celebrations at Golconda : తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవేదికపై సగర్వంగా చాటాలని సూచించారు. పెట్టుబడల సాధన కోసం అమెరికాలో పర్యటించామని స్పష్టం చేశారు. దిగ్గజ సంస్థల అధినేతలు, ప్రతినిధులతో భేటీ అయ్యామని చెప్పారు. ప్యూచర్ స్టేట్‌గా తెలంగాణను వారికి పరిచయం చేశామని సీఎం వెల్లడించారు. గోల్కొండ కోటలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని సీఎం రేవంత్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
'ముందుగా దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహానుభావుల త్యాగాలతో స్వాతంత్య్ర సాధించుకున్నాము. నెహ్రూ దార్శనికత ఫలితంగానే దేశం ఈస్థాయిలో ఉంది. నెహ్రూ ప్రారంభించిన ప్రాజెక్టులతోనే దేశం సస్యశ్యామలంగా ఉంది. బీహెచ్‌ఈఎల్, మిధాని వంటి పరిశ్రమలను నెహ్రూ స్థాపించారు. లాల్‌బహుదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ సాగులో విప్లవం తెచ్చారు. కాంగ్రెస్ దేశానికి చేసిన సేవలకు ఇవి కొన్ని ఉదాహరణలే. 2004లో తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ కరీంనగర్‌లో మాటిచ్చారు' అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
అమెరికా పర్యటనలో ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడితో సమావేశం అయ్యానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశం సానుకూలంగా జరిగిందని, తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ అంగీకరించినట్లు చెప్పారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు ఇప్పటికే అమలు చేశామని అన్నారు. ఆరోగ్య శ్రీ పథకానికి పూర్వ వైభవం తెచ్చామని వివరించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచినట్లు గుర్తు చేశారు.
ఈ ఏడాదే ఫసల్‌బీమాలో చేరాలని నిర్ణయం : 'వరంగల్ డిక్లరేషన్ అమల్లో భాగంగా రుణమాఫీ చేస్తున్నాము. రుణమాఫీ అసాధ్యమని కొందరు వక్రభాష్యం చెప్పారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి చూపిస్తున్నాం. రుణమాఫీపై విపక్షాలు రంధ్రాన్వేషణ చేస్తున్నాయి. సాంకేతిక కారణాలతో కొందరికి రుణమాఫీ అందట్లేదు. అలాంటి వారిని గుర్తించి రుణమాఫీ అమలు చేస్తాం. కలెక్టరేట్లో కౌంటర్లు ఏర్పాటు చేసి రుణమాఫీ సమస్యలు పరిష్కరిస్తాం. రుణమాఫీ అమలుతో తమ జన్మధన్యమైందని భావిస్తున్నాము. అర్హులైన అందరికీ రైతు భరోసా అందిస్తాం. గత ప్రభుత్వం అనర్హులకు రైతు బంధు ఇచ్చింది. త్వరలో రైతుభరోసా పథకాన్ని ప్రారంభించబోతున్నాము. ఈ ఏడాది నుంచి ఫసల్‌బీమాలో చేరాలని నిర్ణయించాం.' అని రేవంత్ తెలిపారు.
సన్నరకం వరి సాగును ప్రోత్సహించేందుకు రూ.500 బోనస్ చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రూ.500 బోనస్‌కు 33 రకాల వరిధాన్యాలను గుర్తించామని పేర్కొన్నారు. పెండింగ్ ధరణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారానికి సమగ్ర చట్టం తీసుకురావాలని భావిస్తున్నామని వివరించారు. డ్రగ్స్ మాట వినపడకూడదని, కనపడకూడదని కఠిన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. మాదక ద్రవ్యాల నియంత్రణ, నివారణకు జీరో టాలరెన్స్ పద్ధతిని అనుసరిస్తున్నామన్నారు. టీ-న్యాబ్‌ను బలోపేతం చేశామని చెప్పారు. సైబర్ మోసాలు, నేరాలు బారినపడిన వారికి 1930 నంబరు ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
'త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అంగన్వాడీలను ప్రీప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నాం. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను నిర్మించబోతున్నాము. బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను నిర్మించనున్నాము. ఇటీవలే స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నాము. స్కిల్ వర్సిటీ విప్లవాత్మక మలుపు కాబోతోంది. స్కిల్ వర్సిటీకి ఆనంద్ మహీంద్రాను ఛైర్మన్‌గా నియమించాం.' - సీఎం రేవంత్