Praja Palana Dinotsavam 2024 : తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని ఎవ్వరూ తప్పుపట్టవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హితవు పలికారు. రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు పోరాడారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ అంటేనే త్యాగం, బలిదానమని అభివర్ణించారు. రాష్ట్రప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఆయన తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనాన్ని స్వీకరించారు.
అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి తాను ఫామ్‌హౌస్ సీఎంను కాదు, పని చేసే ముఖ్యమంత్రిని అని అన్నారు. నియంత నుంచి తెలంగాణకు స్వేచ్ఛ కల్పిస్తామని ఆనాడు ప్రజలకు భరోసా ఇచ్చామన్న ఆయన, పదేళ్ల పాటు విధ్వంసమైన తెలంగాణను మళ్లీ గాడిలో పెడతామని హామీ ఇచ్చారు. హైడ్రాను బెదిరిస్తున్న భూ మాఫియాను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. నిజాంపై దాశరథి వ్యాఖ్యలను చదివి వినిపించారు.
రైతులు, కార్మికుల సంక్షేమం దిశగా పాలన : సెప్టెంబరు 17న ప్రజాపాలన దినోత్సవం జరపాలని నిర్ణయించామన్న రేవంత్ రెడ్డి, విలీనం, విమోచనం అంటూ స్వ ప్రయోజనాల కోసం ప్రవర్తించడం సరికాదని హితవు పలికారు. అందరూ కలిసి ఉంటారని చెప్పేందుకు సూచిక బిగించిన పిడికిలి అని అభివర్ణంచారు. పెత్తందార్లు, నియంతలపై పిడికిలి బిగించి పోరాటం చేశామని వెల్లడించారు. నియంత నుంచి తెలంగాణకు స్వేచ్ఛ కల్పిస్తామని ఆనాడు భరోసా ఇచ్చామన్న రేవంత్ రెడ్డి, పదేళ్ల పాటు విధ్వంసమైన తెలంగాణను మళ్లీ గాడిలో పెడుతున్నామని పేర్కొన్నారు. రైతులు, కార్మికుల సంక్షేమం దిశగానే తమ పాలన ఉంటుందని స్పష్టం చేశారు.
తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తాం : డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని బీఆర్ఎస్పై మండిపడ్డారు. కేంద్రం నుంచి మన వాటా తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం దిల్లీ వెళ్లినా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 'నేను ఫామ్‌హౌస్ సీఎంను కాదు పనిచేసే ముఖ్యమంత్రిని. మన హక్కుల సాధన కోసం ఎన్నిసార్లయినా దిల్లీ వెళ్తాం. పెట్టుబడుల ఆకర్షణలో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాం. మూసీ సుందరీకరణ ద్వారా హైదరాబాద్ రూపురేఖలు మారుస్తాం' అని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం - తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం - Praja Palana Day