CM Revanth Review On Khammam Floods : వరదల వల్ల ఖమ్మం జిల్లా తీవ్రంగా నష్టపోయిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. 40 సెంటీమీటర్ల వర్షాన్ని ఎప్పుడూ చూడలేదని ప్రజలు అంటున్నారని తెలిపారు. ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పంటనష్టం వివరాలు సేకరిస్తున్నామని, పరిహారం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి రూ.10 వేలు పరిహారం ఇస్తామని తెలిపారు.
వరద బాధిత కుటుంబాలకు తక్షణం రూ.10 వేలు ఇస్తామని వెల్లడించారు. అదేవిధంగా విపత్తులు వచ్చినప్పుడు సాయం చేసేందుకు రాష్ట్రంలోని 8 ప్రాంతాల్లో విపత్తు బృందాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వరదల వల్ల రాష్ట్రంలో రూ.5,430 కోట్ల ఆస్తి నష్టం జరిగిందన్న ఆయన, విపత్కర పరిస్థితుల్లో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్రానికి సాయం చేయాలని కోరారు. ప్రధాని స్వయంగా వచ్చి నష్టాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ విపత్తుగా పరిగణించి వెంటనే నిధులు ఇవ్వాలని కోరినట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు.
వరద సమయంలో బురద రాజకీయాలా? : ఇప్పటి వరకు వరదల వల్ల రాష్ట్రంలో 16 మంది మరణించినట్లు సీఎం వెల్లడించారు. వరద బాధితులు సర్వం కోల్పోయారని, వారికి ఆహారం, తాగునీరు, ఔషధాలు సకాలంలో అందిస్తున్నట్లు తెలిపారు. ఆ దిశగానే ఎక్కడికక్కడ పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశామని వివరించారు. దెబ్బతిన్న రోడ్లు త్వరగా పునరుద్ధించేందుకు అత్యవసర చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇలాంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఆలోచించాలని, కష్టాల్లో ఉన్న ప్రజల వద్దకు వెళ్లడం కేసీఆర్ బాధ్యతని తెలిపారు.
ప్రజలకు కష్టం వస్తే ప్రభుత్వం కంటే ముందు ప్రతిపక్ష నేతలే ఎక్కడైనా వెళ్తారని అన్నారు. కానీ ఇక్కడ మాత్రం ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మౌనముద్ర వహించారని, కేటీఆర్ ఎక్స్ ద్వారానే మాట్లాడతారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ అమెరికాలో ఉండి, ఇక్కడ మంత్రులు పట్టించుకోలేదని ఎలా చెబుతారని రేవంత్ మండిపడ్డారు. ప్రజలకు కష్టం వచ్చినా కేసీఆర్ స్పందించరని, కనీసం పలకరించరని విమర్శించారు.
CM Revanth Fires On BRS Party : బీఆర్ఎస్ నేతల వైఖరి వల్ల ప్రజలు ఇంకా ఇబ్బంది పడుతున్నారని ధ్వజమెత్తారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముందుకొచ్చి తనవంతు సాయంగా కొంత మొత్తం అందించడమే కాకుండా నైతిక మద్దతు ఇచ్చారని తెలిపారు. విపత్తుల వేళ గులాబీ నేతలు మాత్రం ప్రజలకు చిల్లిగవ్వ ఇవ్వరని దుయ్యబట్టారు. పైగా వరద సమయంలో బురద రాజకీయాలు చేస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు.
"ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాని కంటే ముందు ప్రజలు వద్దకు వెళ్లాలి. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి నివేదించాలి. అవసరమైతే రాష్ట్ర సర్కార్ను నిలదీసినా పర్వాలేదు. విపత్తులు వచ్చినప్పుడు అంతా కలిసిపనిచేయాలని కానీ ప్రజలకు కష్టం వస్తే ప్రతిపక్ష నేత కేసీఆర్ స్పందించక మౌనముద్ర వహిస్తున్నారు. రెండవది అమెరికాలో కూర్చొని ఎక్స్ వేదికగా స్పందించే కేటీఆర్, ఖమ్మంలో ముగ్గురు మంత్రులు పట్టించుకోవడం లేదని ఎలా చెబుతారు."- రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి