CM Revanth Serious About Increase in Construction Cost of Super Specialty Hospital : వరంగల్ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ అంచనా వ్యయం ఇష్టారీతిన పెంచడంపై అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అప్రూవ్ లేకుండా రూ.1,100 కోట్లున్న అంచనా వ్యయాన్ని రూ.1,726 కోట్లకు ఎలా పెంచుతారని ప్రశ్నించారు. కేవలం మౌలిక ఆదేశాలతో రూ.626 కోట్ల వ్యయం ఎలా పెంచుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయం పెంచడమేంటన్నారు. నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా యుద్ధప్రాతిపదికన ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థదేనని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమీక్ష సమావేశంలో మాట్లాడిన సీఎం హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని సీఎం రేవంత్ సూచనలు చేశారు. భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
జాతీయ రహదారి నుంచి జాతీయ రహదారికి కనెక్ట్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి టెక్స్‌టైల్ పార్కుకు కనెక్టివిటీ ఉండేలా అలాగే రోడ్డు మార్గం ఉండేలా చూడాలని సీఎం అన్నారు. స్మార్ట్ సిటీ మిషన్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు.
నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. వరంగల్ నగర అభివృద్ధిపై ప్రతి 20 రోజులకోసారి ఇంఛార్జి మంత్రి సమీక్ష నిర్వహించాలని పేర్కొన్నారు. నగర అభివృద్ధికి సంబంధించి సహకారం అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. వరంగల్‌లో డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన వివరాలు : ముందు సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటకు చేరుకున్నారు. అక్కడ సీఎంకు ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు. ముందుగా నిర్మాణంలో ఉన్న మెగా టెక్స్‌టైల్ పార్కును సందర్శించి, నిర్మాణ పురోగతిని తెలుసుకున్నారు.
వనమహోత్సవంలో భాగంగా టెక్స్‌టైల్ పార్కులో సీఎం మొక్క నాటారు. ఈ పార్కుకు భూములు ఇచ్చిన రైతులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని పరిశీలించారు. అక్కడి నుంచి హనుమకొండలో మహిళ స్వశక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు. అక్కడే మంత్రులతో కలిసి భోజనం చేశారు. క్యాంటీన్ పరిసరాలను కలియతిరిగారు. అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు.