CM Revanth To Launch Indiramma Housing Scheme Today : అభయహస్తం ఆరు గ్యారంటీల్లోని 13 కార్యక్రమాల్లో మరో పథకానికి ప్రభుత్వం ఇవాళ శ్రీకారం చుట్టనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి భద్రాచలంలో ప్రారంభించనున్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.
Indiramma Housing Scheme in Telangana 2024 : ప్రత్యేక హెలికాప్టర్‌లో సారపాక చేరుకోనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం వచ్చి భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం భద్రాచలం మార్కెట్ యార్డులో సుమారు 5,000ల మంది మహిళల సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత భద్రాచలం ఆలయ అభివృద్ధిపై అధికార యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
ఫార్మా, లైఫ్‌సైన్స్ రంగ విస్తరణకు కట్టుబడి ఉన్నాం : సీఎం రేవంత్ రెడ్డి
ఇందిరమ్మ పథకంలో పేదలకు స్థలంతో పాటు రూ.5 లక్షలు కేటాయించనున్నారు. మొదటి విడతలో సొంత స్థలం ఉన్నవారికి రూ.5 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఏటా నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఈ ఏడాది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేసింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం తెలంగాణ సర్కార్ హడ్కో నుంచి రూ.3000ల కోట్ల రుణం కూడా తీసుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు మాయమాటలు చెప్పి కాలం వెళ్లదీసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కానీ కాంగ్రెస్ సర్కార్ అర్హులైన అందరికీ ఇండ్లను అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
"తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలు వచ్చినప్పుడూ మాత్రమే హామీలు ఇచ్చింది. తిరిగి వాటిని అమలును మరిచిపోయింది. వారు ఏం హామీలు ఇచ్చారో వాటిని విస్మరించి పది సంవత్సరాలు పాలన సాగించింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో పేదలకు మాయమాటలు చెప్పి కాలం వెళ్లదీసింది. కానీ కాంగ్రెస్ సర్కార్ అర్హులైన అందరికీ ఇండ్లను అందిస్తుంది." - పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గృహనిర్మాణశాఖ మంత్రి
Indiramma Housing Scheme 2024 : ఇందిరమ్మ ఇండ్ల ( TS Indiramma Housing Scheme) లబ్ధిదారులకు తెల్లరేషన్ కార్డుతో పాటు సొంత స్థలం లేదా ప్రభుత్వం ఇచ్చిన భూమి ఉండాలి. గుడిసె ఉన్నా, గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు లేదా మట్టి గోడల తాత్కాలిక ఇల్లున్నా ఇందిరమ్మ పథకానికి అర్హులుగా పేర్కొన్నారు. అద్దె ఇంట్లో ఉంటున్నా, వివాహమై ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా పథకానికి అర్హులే. ఒంటరి, వితంతు మహిళలూ లబ్ధిదారులుగా ఎంపిక కావచ్చు. ఇందిరమ్మ ఇంటిని మహిళ పేరు మీదే మంజూరు చేస్తారు. ఇంట్లో వితంతు ఉంటే ఆమె పేరిటే ఇస్తారు.
జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి : సీఎం రేవంత్ రెడ్డి
జిల్లా ఇంఛార్జ్ మంత్రిని సంప్రదించి గ్రామ, వార్డుసభల్లో ఆమోదం పొందిన తర్వాత లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారు. లబ్ధిదారులకు నాలుగు దశల్లో ఆర్థిక సహాయం అందుతుంది. బేస్‌మేంట్ స్థాయిలో లక్ష రూపాయలు, పైకప్పు స్థాయిలో మరో లక్ష, పైకప్పు నిర్మాణం తర్వాత రూ.2 లక్షలు, నిర్మాణం పూర్తయ్యాక లక్ష రూపాయలు విడుదల చేస్తారు. నిర్మాణ దశలను పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
CM Revanth Reddy Bhadrachalam Tour Today : ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం అనంతరం సాయంత్రం మణుగూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటారు. ఈ సభా వేదిక నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లోక్‌సభ ఎన్నికల శంఖరావం పూరిస్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి తొలిసారి భద్రాద్రి జిల్లాకు వస్తుండటంతో అటు అధికార యంత్రాంగం, ఇటు కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.
'ఇందిరమ్మ ఇళ్లు'పై ప్రభుత్వం కీలక నిర్ణయం - పట్టణ గృహాలకు కేంద్రం సాయం తీసుకోవాలని యోచన
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి హడ్కో నుంచి ప్రభుత్వానికి రూ.3 వేల కోట్ల రుణం