CM Jagan Negligence in Nadu Nedu Works : 2020 ఫిబ్రవరి 5న ముఖ్యమంత్రి జగన్ నోటివెంట ఎన్నో మాటల వచ్చాయి. ఇప్పుడు ఆ మాటలు పూర్తి రివర్స్ అయ్యాయి. ఓ వైపు 'నాడు- నేడు' పేరుతో కోట్లు వెచ్చించి పనులు చేస్తున్న ప్రభుత్వం మరోవైపు తరగతుల విలీనం పేరుతో అవే పాఠశాలల్లో విద్యార్థులు లేకుండా చేస్తోంది. విద్యార్థులున్న చోట మాత్రం పనులను పూర్తి చేయడం లేదు.
Nadu Nedu Works in AP : ప్రభుత్వ పాఠశాలల్లో తరగతుల విలీనం పేరిట ప్రాథమిక విద్యలో విధ్వంసం సృష్టిస్తోంది. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ విధానం అంటూ ప్రాథమిక బడుల్లోని 3, 4, 5 తరగతుల్ని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేస్తోంది. ఓ వైపు విద్యార్థులు తగ్గిపోతుండగా మరోవైపు నాడు-నేడు కింద చేసిన కోట్ల రూపాయల పనులు బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నాయి. నాడు- నేడు కింద 15 వేల 715 పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించారు. దీని కోసం 3 వేల 669 కోట్లు ఖర్చు చేశారు. 2019 నవంబరు 14న మొదలు పెట్టిన పనులను 2021 ఆగస్టు 16 నాటికి పూర్తి చేశారు. ఆ తర్వాత ఈ పనులు చేసిన బడుల్లో నుంచి 3, 4, 5 తరగతుల విద్యార్థులను కిలోమీటరు దూరంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించారు. 212 ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన 3 నుంచి 8 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలిపేశారు.
నిధులు లేక నిలిపివేసిన నాడు-నేడు పనులు - శిధిల భవనంలోనే తరగతుల నిర్వహణ
అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ ప్రాథమిక పాఠశాలలో 24 లక్షల రూపాయలతో మరమ్మతులు చేశారు. గతంలో 1 నుంచి 5 తరగతుల్లో 126 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 1, 2 తరగతుల్లో 13 మంది విద్యార్థులు మాత్రమే మిగిలారు.
చోడవరం మండలంలోని జుత్తాడ ప్రాథమిక పాఠశాలలో 18 లక్షల రూపాయలతో మరమ్మతులు చేశారు. గతంలో అక్కడ 80 మంది విద్యార్థులు ఉండగా ఇప్పుడు 25 మంది మాత్రమే మిగిలారు. గదులు ఖాళీ అయ్యాయి.
జగనన్న సర్కారులో చదువులంటే విద్యార్థుల్లో గుండెల్లో గుబులే- శిథిలావస్థకు చేరినా పట్టించుకోని పాలకులు
నెల్లూరు జిల్లా మర్రిపాడులోని ప్రధాన మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలను 21 లక్షల రూపాయలతో అభివృద్ధి చేశారు. తరగతుల విలీనంతో 4 గదులు నిరుపయోగంగా మారాయి.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం అర్థంతరంగా ఆగిపోయింది. దీనితో పాటు తరగతుల విలీనంతో 159 మంది విద్యార్థులు ఇక్కడకు వచ్చారు. గదుల సమస్య ఏర్పడడంతో అసంపూర్తి భవనంలోనే ఏడో తరగతి విద్యార్థులను కూర్చోబెడుతున్నారు.