CM Jagan Neglect Prakasam Barrage : అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్ల శని ఉన్నట్లు తయారైంది కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల పరిస్థితి. కృష్ణా నది పక్కనే ప్రవహిస్తున్నా దాన్ని సరిగా వినియోగించుకోలేక పోతున్నారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన సాగునీటి ప్రాజెక్టులేమీ లేకపోవడంతో వందల కొద్దీ టీఎంసీల నదీజలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. ప్రకాశం బ్యారేజీ దిగువన రెండు బ్యారేజీల నిర్మాణానికి హామీ ఇచ్చిన జగన్ సర్కార్ తీరా చేతులెత్తేసింది. అరకొర బోరునీరే పంటల సాగుకు దిక్కవుతోంది..
కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన రెండు బ్యారేజీల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని 2020లో సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆ మాటిచ్చి నాలుగేళ్లయింది, ఎన్నికలూ అయిపోయాయి. కానీ, జగన్ ఇచ్చిన హామీ మాత్రం నెరవేరలేదు. కృష్ణా నదిపై ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం కలగానే మిగిలిపోయింది. ఫలితంగా కృష్ణా జిల్లాలో గతేడాది రెండో పంటకు నీరందలేదు. ఈ ఏడాది ప్రభుత్వం ఏకంగా క్రాప్ హాలీడే ప్రకటించేసింది.
జగన్ పాలనలో ఒక్క ఎకరాకు అదనంగా నీరు ఇవ్వలేదు: ఎన్డీఏ నేతలు - NDA Leaders Fire On CM Jagan
కృష్ణా వరద జలాలు 2019లో 799.13 టీఎంసీలు సముద్రంలో పాలవగా 2023 నాటికి అది 1325.10 టీఎంసీలకు పెరిగింది. 2024లో ఇప్పటి వరకు 67.96 టీఎంసీల జలాలు సముద్రంలో కలిసిపోయాయి. సముద్రం ఎగపోటుతో వచ్చే ఉప్పునీటితో భూగర్భ జలాలు కఠినంగా మారిపోతున్నాయి. దీనివల్ల పంట భూములు చౌడుబారే ప్రమాదమూ ఉంది. ప్రత్యేకించి దివిసీమ ప్రాంతమంతా ఉప్పుమయంగా మారిపోతుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీ దిగువన రెండు బ్యారేజీలు, ఎగువన ఒక బ్యారేజీ నిర్మించేందుకు నిర్ణయించింది.
ప్రకాశం బ్యారేజీ దిగువన నిర్మించ తలపెట్టిన రెండు బ్యారేజీలకు రూ.200 కోట్లతో సవివర పథక నివేదికలను సిద్ధం చేసింది. మొదటి బ్యారేజీని ప్రకాశం బ్యారేజీకి 16 కిలోమీటర్లు దూరంలో కృష్ణా జిల్లా చోడవరం- గుంటూరు జిల్లా రామచంద్రాపురం మధ్య రూ.2235.42 కోట్లతో నిర్మించాలని ప్రతిపాదించింది. రెండో బ్యారేజీని మోపిదేవి మండలం బండికొల్లంక, రేపల్లె మండలం తూర్పుపాలెం మధ్య రూ. 2,526 కోట్లతో నిర్మించాలని నిర్ణయించింది.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు బ్యారేజీలకు 2020 సెప్టెంబరులో స్టేజీ 1 ఖర్చులు అంటే సర్వే, ఇతర అవసరాల కింద కొంత నిధులు విడుదల చేస్తూ జీవో కూడా జారీచేసింది. 2022 ఏప్రిల్‌లో ఆర్వీ ఆసోసియేట్ అనే సంస్థ జలవనరుల శాఖకు సవివర నివేదిక అందజేసింది. కానీ, ఇంతవరకు టెండర్లకు మోక్షం లభించలేదు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురం వద్ద తెలుగుదేశం హయాంలో నిర్మించ తలపెట్టిన బ్యారేజీ డీపీఆర్ పై ఇంతవరకూ టెండర్ కూడా పిలువలేదు.
ఈ ప్రాజెక్టులు పూర్తైతే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పొలాలకు సాగునీటితో పాటు ప్రజలకు తాగునీటిని సైతం అందించవచ్చు. భూ గర్భ జలాలు వృద్ధి చెందడమే కాకుండా నీటిలో ఉప్పు శాతం కూడా తగ్గుతుంది. కరకట్టల కోతలను కొంతవరకు అడ్డుకోవచ్చు. ఇవేమీ పట్టించుకోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లూ మొద్దునిద్రలోనే జోగింది.
కృష్ణా జలాలు పక్క నుంచి వెళ్తున్నా వినియోగించుకోలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. బోరు నీటితో పంటలు సరిగా పండట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చే ప్రభుత్వమైనా రెండు బ్యారేజీలు నిర్మిస్తందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.