CM Jagan Neglect Building Construction Labours in AP : సీఎం జగన్ రాజధానుల పేరిట ఆడిన మూడు ముక్కలాటలో స్థిరాస్తి రంగం కుదేలైంది. ఆ ఆటలో భవన నిర్మాణ కార్మికులు సమిధలయ్యారు. గత ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవడం మొదలు కార్మికుల జీవనోపాధిని నాశనం చేయడమే లక్ష్యమన్నట్లుగా జగన్ పనిచేశారు. నూతన ఇసుక విధానం పేరిట రీచ్‌లను మూసివేసి ఇసుక అందుబాటులో లేకుండా చేశారు. దీంతో ఒక్కసారిగా నిర్మాణాలు ఆగిపోయి కార్మికులకు నెలల తరబడి ఉపాధి కరవైంది. ఒకటి, రెండు రోజులు పనులు దొరక్కపోతేనే పూట గడవని కుటుంబాలు కొన్ని నెలలపాటు అల్లాడిపోయాయి. ఇంటి అద్దెలు, వైద్యం, పిల్లల ఫీజులు, రోజువారీ ఖర్చులు భారంగా మారి అప్పులపాలయ్యారు. అంతలోనే వచ్చిన కరోనాతో వారి పరిస్థితి మరింత దిగజారింది.
అయిదేళ్ల నుంచి వారు అనుభవిస్తున్న కష్టాలను 'మే డే' సందర్భంగా పరిశీలిస్తే రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ పాలించిన తొలి అయిదేళ్లు నిర్మాణ రంగం జోరుగా సాగింది. రాష్ట్ర రాజధాని నిర్మాణ పనుల్లో వేల మంది కార్మికులు వచ్చి పనిచేశారు. గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగింది. వందల నిర్మాణాలు మొదలు అయ్యాయి. రాష్ట్రంలో ఉన్న కార్మికులు సరిపోక ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు. కానీ జగన్ అధికారంలోకి రాగానే అమరావతిని అటకెక్కించడంతో స్థిరాస్తి వ్యాపారం ఒకసారిగా కుదేలైంది. భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. రాజధాని ప్రాంతంలో భవనాలు నిర్మించేందుకు అప్పులు చేసి, స్థలాలు కొని, నిర్మాణాలు చేపట్టిన వారు వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. కొత్త ఇసుక విధానం పేరుతో అయిదు నెలలపాటు ఇసుక రీచ్‌లను బంద్ చేశారు. జగన్ సర్కార్ 2019 సెప్టెంబరు 5 నుంచి నూతన ఇసుక విధానం తెచ్చింది. అప్పుడు నదుల్లో నీరు ఉండడంతో ఇసుక లభ్యం కాలేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయి నిర్మాణ రంగం ఉక్కిరిబిక్కిరైపోయింది.
బలైపోయింది ఎవరు? : సీఎం జగన్ నూతన ఇసుక విధానం వల్ల రాష్ట్రంలో తాపీ మేస్త్రీలు, కూలీలు, రాడ్ బెండింగ్ మేస్త్రీలు, సెంట్రింగ్, సామగ్రి మోసే కార్మికులు, సీలింగ్ పనిచేసేవారు, ఎలక్ట్రిషియన్లు, వడ్రంగులు, ప్లంబర్లు, టైల్స్ వేసేవారు, పెయింటర్లు, కంకర, ఇటుకలు, ఇసుక మోసే కార్మికులు తీవ్రంగా నష్టపోయారు.
50 లక్షల మందిని హింసించారు : రాష్ట్రంలోని 59 రంగాల్లో పనిచేసే కార్మికులు తమ పేర్లను సంబంధిత శాఖలో నమోదు చేసుకుంటారు. ఇలా నమోదు చేసుకున్న కార్మికులు 19.46 లక్షల మంది ఉన్నారు. నమోదు చేసుకోని వారి సంఖ్య దీనికి రెట్టింపు ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం సుమారు 50 లక్షల మంది ఉంటారని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. నిర్మాణ రంగంపై పరోక్షంగా ఆధారపడిన లారీ, ఆటో, ట్రాలీల డ్రైవర్లు, వాటి యజమానులు, నిర్మాణ సామగ్రి విక్రయించే దుకాణదారులు, వాటిలో పని చేసేవారు, భవన నిర్మాణ కార్మికులు, తాపీ మేస్త్రీలు, రాడ్ బెండింగ్, సెంట్రింగ్, ఎలక్ట్రిషియన్, ప్లంబర్, టైల్స్ మేస్త్రీలు, రంగులు వేసేవారు ఇలా అనేక వర్గాల చెందిన లక్షల మంది సీఎం జగన్ పాలనలో నష్టపోయారు.
ఆ ప్రకటనతో అంతా అస్తవ్యస్తం : సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనతో కార్మికుల జీవితం తారుమారైంది. కొత్తగా భవనాలు నిర్మించడానికి యజమానులు ముందుకు రాకపోవడంతో పనులే ఉండడం లేదు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్దకే 1000 మంది వరకు కార్మికులు నిత్యం వస్తున్నారు. వచ్చిన వారిలో సగం మంది పనిలేక ఇళ్లకు వెళ్లిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. చంద్రబాబు హయాంలో అమరావతిలో నిర్మాణాలు జోరుగా సాగినప్పుడు తమకు గిరాకీ ఉండేదని, రోజుకు రూ.1200 ఇచ్చి మరీ తీసుకెళ్లేవారని, ప్రస్తుతం రూ.800 కూడా రావట్లేదని కార్మికులు వాపోతున్నారు.
"బాపట్ల జిల్లా అద్దంకికి చెందిన మేము ఏడేళ్ల క్రితం విజయవాడలో స్థిరపడ్డాం. నేను నా భర్త ఇద్దరం కలిసి ఇక్కడే మేస్త్రీ పని చేసుకునేవాళ్లం. అమరావతి రాజధాని పనులు మధ్యలో ఆగిపోవడంతో మా ఇద్దరిలో ఒక్కరికే పని దొరుకుతోంది. వారానికి మూడు రోజులపాటు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాల్సి వస్తోంది. పిల్లల ఫీజులు భారమై ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాం. ఇక్కడ పని చేసిన వాళ్లు చాలా మంది హైదరాబాద్ వెళ్లిపోయారు. మేం కూడా వెళ్లిపోదాం అనుకుంటున్నాం" -ఓ కూలి ఆవేదన
జగన్ ఏలుబడిలో అటకెక్కిన జలయజ్ఞం - సాగునీటి ప్రాజెక్టులకు అన్యాయం - NEGLIGENCE ON JALAYAGNAM
బోర్డును... భోంచేశారు!
భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఆకలితో అలమటిస్తుంటే జగన్ వాళ్ల నిధులను మింగేసి, ఏమీ పట్టనట్లు వ్యవహరించారు. కార్మికులను ఆదుకునేందుకు సంక్షేమ బోర్డుకు నిర్మాణదారులు భవన నిర్మాణ విలువలో ఒక శాతం పన్ను చెల్లిస్తారు. బోర్డు వద్ద రూ.2,500 కోట్లకు పైగా నిధులు ఉండగా ఇందులో నుంచి రాష్ట్ర ఫైనాన్సియల్ కార్పొరేషన్లో డిపాజిట్ పేరుతో రూ.750 కోట్లు లాగేశారు.
- కార్పొరేషన్లో డిపాజిట్ చేయించుకోవడమే కాకుండా వైఎస్సార్ బీమా పథకం కోసం ఏటా రూ.300 కోట్ల వరకు మళ్లించేస్తున్నారు. ఇలా అయిదేళ్లలో రూ.1,500 కోట్లు మళ్లించారు.
- సీఎం జగన్ నవరత్నాల పథకాలను అందరికి అందిస్తున్నామంటూ సంక్షేమ బోర్డు కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేసింది. నిర్మాణదారుల నుంచి ఒక శాతం పన్ను వసూలుచేసి, ఇతర అవసరాలకు వాడేసుకుంది.
- భవన నిర్మాణ కార్మికులకు వైఎస్సార్ కల్యాణమస్తు పథకాన్ని 2022 అక్టోబరు నుంచి అమల్లోకి తెచ్చింది. 2019 నుంచి 2022 వరకు పెళ్లిళ్లు చేసుకున్న వేల మంది కార్మికుల పిల్లలకు బోర్డు నుంచి సహాయం ఇంతవరకు అందలేదు.
- కరోనా మొదటి దశలో కార్మికుల సంక్షేమ బోర్డు నిధుల నుంచి ప్రతి కార్మికుడికి రూ.5000 సాయం అందుతుందని కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర కార్మిక శాఖ నుంచి వివరాలు సైతం సేకరించింది. ఆ సాయం అందుతుందనే ఆశతో వేల మంది దీనికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఒక్క పైసా కూడా ఇంతవరకు అందలేదు.
- కార్మికుల కుటుంబాల్లో యజమాని కాకుండా ఇతరులకు ప్రమాదం జరిగి శాశ్వత వైకల్యం ఏర్పడినా పరిహారం అందలేదు. గతంలో బోర్డు నుంచి సహాయం ఇచ్చేవారు. వైఎస్సార్ బీమా పథకంలో కార్మికులను కలిపేయడంతో యజమానికి తప్ప ఇతరులకు పరిహారం అందడం లేదు.
- నిర్మాణ రంగ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి నిధులు, పథకాలు ఇవ్వడం లేదు.
- కొన్నిచోట్ల కుటుంబ సభ్యులందరూ భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. వీరి పేర్లు బోర్డులోనూ నమోదయ్యాయి. ఇలాంటి కుటుంబాల్లో యజమాని చనిపోతేనే బీమా పరిహారం వస్తుంది. మిగతా వారికి వర్తించడం లేదు. జగన్ సర్కార్ ఇవేమీ పట్టించుకోలేదు.