CM Jagan Corruption and Irregularities: వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుని జగన్ చేసిన పాపాలు అన్నీఇన్నీ కావు. ఇండియా సిమెంట్స్‌కు అనుచిత లబ్ధి చేకూర్చారు. ఉమ్మడి కడప జిల్లాలో భూమి లీజు పొడిగింపుతోపాటు , తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఉన్న రెండు కంపెనీలకు నీటి కేటాయింపుల వ్యవహారంలో ఇండియా సిమెంట్స్‌కు లాభం చేకూర్చారు ఫలితంగా జగన్ సంస్థలైన భారతి సిమెంట్స్. జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏషియా హోల్డింగ్స్‌లోకి 140 కోట్ల పెట్టుబడులు ప్రవహించాయి. ఈ వ్యవహారంపై సీబీఐ 2011 ఆగస్టు 17న ఎఫ్ఐఆర్ నమోదు కాగా 2013 సెప్టెంబరు 10న అభియోగపత్రం దాఖలు చేసింది. నిందితులుగా జగన్-ఏ1, వి.విజయసాయిరెడ్డి -ఏ2, ఎన్.శ్రీనివాసన్-ఏ3 తోపాటు అధికారులు, సంస్థలను కలిపి 9 మందిని చేర్చింది. ఈ కేసు ముందుకెళ్లకుండా నిందితులు ఏకంగా 215 సార్లు వాయిదాలు తీసుకున్నారు. ఫలితంగా పదేళ్లయినా కేసు డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణ దశలోనే ఉంది.
సొంత జిల్లా నుంచే దందా మొదలు: వైఎస్ సొంత జిల్లా నుంచే జగన్ దందా మొదలు పెట్టారు. కడప జిల్లా చౌడూరులో ఇండియా సిమెంట్స్‌కు 2.60 ఎకరాల భూమికి లీజు పొడిగింపులో అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు. ఇక్కడ ఇండియా సిమెంట్స్‌కు అవసమరైన నీటిని నిల్వ చేసుకుంటున్నారు. ఇరవై ఏళ్లపాటు ఉన్న లీజు 2003 నాటికి ముగిసిపోవడంతో 75 ఏళ్ల వరకు రెన్యువల్ చేయాలంటూ 2003 జూన్30న ఇండియా సిమెంట్స్ సంస్థ కడప కలెక్టర్‌ను కోరింది. నిబంధనల ప్రకారం లీజును అయిదేళ్ల వరకు పొడిగించవచ్చని కలెక్టర్ 2006 ఫిబ్రవరి 2న దరఖాస్తును సీసీఎల్‌ఏకు పంపించారు.
జల దాహంతో జనం- అధికార దాహంతో సీఎం జగన్
లీజు పొడిగింపు గరిష్ఠంగా 25 ఏళ్లకు మించరాదనే నిబంధనను గుర్తుచేశారు. ఇక్కడే నాటి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శామ్యూల్ చక్రం తిప్పారు. అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు నుంచి అయిదేళ్ల పొడిగింపునకు అనుమతి తీసుకుని, సీఎం వైఎస్ అనుమతితో మంత్రిమండలికి డ్రాఫ్ట్ మెమొరాండం సమర్పించారు. మంత్రిమండలి 2008 జూన్ 30న లీజును అయిదేళ్లకే అనుమతిచ్చినా శామ్యూల్ మాత్రం 25 ఏళ్లకు మంజూరు చేస్తూ జీవో ఇచ్చారు.
ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో ఉన్న విశాఖ సిమెంట్స్‌ను 2007లో ఇండియా సిమెంట్స్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీకి కాగ్నా నది నుంచి 10 మిలియన్ క్యూబిక్ అడుగుల నీటి కేటాయింపులున్నాయి. అదనంగా మరో 13 మిలియన్ క్యూబిక్ అడుగులను కేటాయించాలని 2008 మార్చిలో ఇండియా సిమెంట్స్ దరఖాస్తు చేసింది. దస్త్రాన్ని పరిశీలించిన అధికారులు పాత సంస్థ వాడుకున్న నీటికి రాయల్టీ చెల్లించలేదని అదనపు కేటాయింపుల ప్రతిపాదన రాష్ట్రం వాడుకోవాల్సిన 6 టీఎంసీలకు మించరాదని, ఎంతకాలం నీటిని కేటాయించాలన్న విషయమే లేదని, సీఈ, అంతర్‌రాష్ట్ర నీటి వనరుల మండలి పరిశీలనలు లేవని అభ్యంతరాలు తెలిపారు. అయినప్పటికీ అప్పటి నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. సీఎం వైఎస్ ఆమోదం తీసుకుని, 2009లో అనుమతులిచ్చేశారు. అయితే, సీబీఐ కేసు నమోదు చేశాక విశాఖ కంపెనీ చెల్లించాల్సిన రాయల్టీ బకాయిలను ఇండియా సిమెంట్స్ 2011లో రూ.17.87 లక్షలుగా లెక్కించి చెల్లించింది.
మెగా డీఎస్సీకి తిలోదకాలు - ఎన్నికల గుమ్మంలో మినీ డీఎస్సీతో 'జగన్నాటకాలు'!
నల్గొండ జిల్లాలో రాశి సిమెంట్స్‌ను సైతం 1998లో ఇండియా సిమెంట్స్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీకి అప్పటికే ఉన్న మూడు లక్షల గ్యాలన్ల నీటికి అదనంగా మరో ఏడు లక్షల గ్యాలన్ల కేటాయింపులోనూ అధికార దుర్వినియోగం జరిగింది. 2007లో రోజుకు 3 లక్షల గ్యాలన్ల నీటి వినియోగానికి ఏడాదికి 1.62 లక్షలు రాయల్టీ చెల్లించేలా ఇండియా సిమెంట్స్ ఏడాది కాలానికి ఒప్పందం చేసుకుంది. అయితే అంతకు ముందు ఎప్పుడూ ఇండియా సిమెంట్స్ రాయల్టీ చెల్లించిన దాఖలాలు లేవు. అదనపు నీటి కేటాయింపులకు మార్గాన్ని సుగమం చేయడానికే 1979లో ఇచ్చిన కేటాయింపుల గడువు ముగిసిన 28 ఏళ్ల అనంతరం ఈ ఒప్పందం చేసుకోవడం విశేషం.
సీఎం వైఎస్ ఆమోదంతో అనుమతులు: ఇది జరిగిన నెలరోజులకే 7లక్షల గ్యాలన్ల నీరు కావాలని కోరడం సీఎం వైఎస్ ఆమోదంతో 2008 జులైలో రోజుకు 10 లక్షల గ్యాలన్ల నీటికి అనుమతిస్తూ జీవో జారీ అయ్యింది. బెంగళూరులోని జగన్ కంపెనీల కార్యాలయం నుంచి సీబీఐ స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్‌ను సీఎఫ్ఎస్ఎల్ ద్వారా విశ్లేషించగా జగన్ కంపెనీల్లోకి నిధులు వచ్చిన గుట్టు రట్టయింది. దీని ప్రకారం 2007 జనవరిలో రఘురాం సిమెంట్స్ కంపెనీ ఏర్పాటుకు ప్రాథమికంగా 465 కోట్లు అవసరం అవుతాయని జగన్, విజయసాయిరెడ్డి కలిసి అంచనా వేశారు. ఇందులో జగన్, ఆయన గ్రూపు 9.71% అంటే 45 కోట్లు పెట్టాలని నిర్ణయించారు. ఈ మొత్తాన్ని 80.16% యాజమాన్య వాటాగా చూపి, కంపెనీ నిర్వహణాధికారాన్ని చేజిక్కించుకున్నారు.
పెట్టుబడుల్లో భాగంగా 95 కోట్లను 75 రూపాయల ప్రీమియంతో వడ్డీ లేని వాటా మూలధనంగా సమీకరించాలని నిర్ణయించారు. ఇందులో 84 కోట్లు కేవలం ప్రీమియంగానే వస్తుండగా, వీటికి డివిడెండ్‌లో ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. ఈ పద్ధతి ప్రకారం పెట్టుబడి పెట్టేవారికి కంపెనీ యాజమాన్యంలో నియంత్రణాధికారాలు ఉండవు. ఈ కోవలోనే ఇండియా సిమెంట్స్ 95 కోట్లు వసూలు చేశారు. వీటికి సంబంధించి జగన్ బృందం రూపొందించిన నమూనా ఒప్పంద పత్రాలు హార్డ్‌డిస్క్‌లో సీబీఐకి లభ్యమయ్యాయి. జగన్ తరఫున విజయసాయి రెడ్డి ఇండియా సిమెంట్స్ నుంచి రఘురామ్ సిమెంట్స్‌లోకి 95.32 కోట్లు, జగతి పబ్లికేషన్స్‌లోకి 40 కోట్లు, కార్మెల్ ఏషియా హోల్డింగ్స్‌లోకి 5 కోట్లను అంటే మొత్తం రూ.140.32 కోట్లను రాబట్టారు.
హెటిరో-అరబిందో స'మేత' జగన్మాయ!
దేశంలోని ప్రముఖ సిమెంట్ కంపెనీలైన దాల్మియా వంటి సంస్థల షేర్లు 40రూపాయలు మాత్రమే ఉండగా జగన్ కంపెనీల్లో ఇండియా సిమెంట్స్ అధిక ప్రీమియంతో పెట్టుబడులు తరలించడాన్ని సీబీఐ బట్టబయలు చేసింది. మొదట 2007లో షేర్‌కు 110 రూపాయల ప్రీమియంతో భారతి సిమెంట్స్‌లో 15 కోట్ల పెట్టుబడి పెట్టింది. బెంగళూరుకు చెందిన పణి అండ్ అసోసియేట్స్ సంస్థ 2010 ఏప్రిల్‌లో భారతి సిమెంట్స్ షేర్‌ను 221.17గా విలువ కట్టింది. ఇది జరిగాక ఇండియా సిమెంట్స్ 1440 ప్రీమియంతో మరోసారి 80.32 కోట్ల పెట్టుబడి పెట్టింది. కేవలం 9 నుంచి 10 నెలల్లోనే ప్రీమియం 110 రూపాయల నుంచి 1440కు అంటే సుమారు 12 రెట్లు పెంచాల్సిన అవసరాన్ని మాత్రం వెల్లడించలేదు.
అక్రమ పెట్టుబడుల అనంతరం జగన్ ఆదేశాల మేరకు ఇండియా సిమెంట్స్ తనకు భారతి సిమెంట్స్‌లో ఉన్న వాటాలను ఫ్రాన్స్‌కు చెందిన కంపెనీకి 121 కోట్లకు విక్రయించింది. ఇది జరిగిన రోజునే కార్పొరేట్ రుణం రూపంలో 125 కోట్లను జగన్ సంస్థలో పెట్టాలని ఇండియా సిమెంట్స్ ఒక తీర్మానాన్ని చేసింది. అంటే జగన్‌కు చెందిన సిమెంట్ ఫ్యాక్టరీలో ఉన్న వాటాల విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును మళ్లీ జగన్ సంస్థకే పంపాలని నిర్ణయించడాన్నిబట్టే అది ‘నీకిది నాకది’ వ్యవహారమని అర్థమవుతోందని సీబీఐ స్పష్టంగా పేర్కొంది. తర్వాత భారతి సిమెంట్స్‌లో తనకున్న వాటాల్లో కొన్నింటిని ఫ్రాన్స్ కంపెనీకి విక్రయించడం ద్వారా జగన్ 446.21 కోట్లు సంపాదించారు.
కేసు విచారణ 215 సార్లు వాయిదా: ఇండియా సిమెంట్స్ అక్రమ పెట్టుబడుల వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసు విచారణ పదేళ్లలో 215 సార్లు వాయిదా పడింది. నిందితులు హైకోర్టును ఆశ్రయించి విచారణపై స్టే పొందారు. ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్, ఇండియా సిమెంట్స్, ఆదిత్యనాథ్ దాస్‌లపై కేసులను హైకోర్టు కొట్టివేయగా సీబీఐ సుప్రీంలో సవాల్ చేసింది. ప్రస్తుతం ఇవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. సీబీఐ అభియోగపత్రం ఆధారంగా ఈడీ 2017 ఏప్రిల్ 4న అభియోగపత్రం దాఖలు చేసింది. నిందితులుగా సీబీఐ కేసులోని 9మందితోపాటు అదనంగా జననీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌ను చేర్చింది.
జగన్ కంపెనీలు, ఇండియా సిమెంట్స్‌కు చెందిన 232 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. తమపై సీబీఐ కేసులను కొట్టివేసినందున ఈడీ కేసును కొట్టివేయాలని కోరుతూ ఎన్.శ్రీనివాసన్, ఇండియా సిమెంట్స్ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. సీబీఐ కోర్టులో ఈడీ కేసు విచారణ 186 సార్లు వాయిదా పడింది. సీబీఐ, ఈడీ దాఖలు చేసిన కేసుల్లో నేరం రుజువైతే గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలున్నాయి. ప్రజాప్రతినిధులుగా ఉన్న వారికి రెండేళ్లు ఆపైన శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది. అంతేగాకుండా శిక్షాకాలం పూర్తయిన ఆరేళ్ల దాకా ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు.