Telugu Language Day 2024 : మాతృభాషతో అనుసంధానమైతే మన సంస్కృతి, విలువలు, సంప్రదాయాలతో మంచి బంధం ఏర్పడుతుంది. దేశంలోని వారసత్వ భాషల్లో తెలుగు సైతం ఒకటి. పలుకు పరవశం మాట మాధుర్యం భావవ్యక్తీకరణ సుమధురం ఇదీ తెలుగు గొప్పతనం. బాధ ఆనందం సంతోషం భావోద్వేగం ఏదైనా అమ్మభాషే ఆధారం. ఇలా మాతృభాష కోసం పరితపించిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని ఏటా నేడు తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు. తెలుగు భాషాభివృద్దికి విశేష కృషి చేసిన మహనీయులను నేడు తలుచుకోవడం ద్వారా అమ్మభాషకు సేవ చేసిన తెలుగు పెద్దలకు కృతజ్ఞతలు చెబుదాం. వారి అడుగుజాడల్లో నడుస్తూ మన భాషను సుసంపన్నం చేసుకుందాం. తెలుగు భాష… pic.twitter.com/2o2hMhcToP
— N Chandrababu Naidu (@ncbn) August 29, 2024
CBN Wishes to Telugu Language Day : దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. మన భాషాభివృద్దికి విశేష కృషి చేసిన మహనీయులను స్మరించుకుందామని చెప్పారు. అమ్మభాషకు సేవ చేసిన తెలుగు పెద్దలకు కృతజ్ఞతలు చెబుదామని పేర్కొన్నారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ మన భాషను సుసంపన్నం చేసుకుందామని ఆకాంక్షించారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని ముందు తరాలకు అందించే బృహత్తర బాధ్యత తీసుకుందామన్నారు. అదే వారికి మనమిచ్చే ఘననివాళి అని తెలిపారు. తెలుగు వెలగాలి తెలుగు భాష వర్థిల్లాలి అని కోరుకుంటూ దాని కోసం పనిచేద్దామని చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఆజన్మాంతం రుణపడి ఉంటారు : మాతృ భాషలో విద్యా విధానం సాగాలనే తలంపుతో వ్యవహారిక భాషోద్యమం చేసిన గిడుగు రామ్మూర్తి పంతులుకి తెలుగు ప్రజలంతా ఆజన్మాంతం రుణపడి ఉంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆయన కృషి ఫలితంగా వ్యవహారిక భాషలో నేడు విద్యాభ్యాసం జరుగుతోందని చెప్పారు. మాతృభాష పరిరక్షణకు ఎన్డీయే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టంచేశారు. సంస్కృతి, సంప్రదాయాలను, విలువలను విద్యార్థి దశ నుంచే సంపూర్ణంగా అవగాహన చేసుకునేందుకు మాతృభాష దోహదపడుతుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
తెలుగు వారిగా గర్వపడదాం : తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగువారందరికీ మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ జన్మనిస్తే, మాతృభాష తెలుగు మన జీవితాలకు వెలుగునిస్తోందని చెప్పారు. తెలుగు వారిగా గర్వపడదాం తెలుగు భాష పరిరక్షణకు కృషిచేద్దామని లోకేశ్ పిలుపునిచ్చారు.