CM Chandrababu Will Release White Paper on Law and Order : శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఈ శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడచిన ఐదేళ్లలో శాంతిభద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరు, అక్రమ కేసులు, నిర్బందకాండ, ప్రతిపక్షాల అణచివేత, పౌరులపై నమోదైన కేసులు తదితర అంశాలపై శ్వేతపత్రం ద్వారా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునేలా గత పాలకులు వ్యవహరించిన తీరు, సాధారణ పౌరుల పైనా కేసులను నమోదు చేసిన వ్యవహారం, ఎస్సీలపై దాడులు, హత్య కేసులు తదితర అంశాలనూ శ్వేతపత్రంలో ప్రస్తావించే అవకాశముంది.
అమరావతి రైతుల ఉద్యమాన్ని అణచివేసేలా అప్పట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, డాక్టర్ సుధాకర్, దళితుడైన డ్రైవర్ సుబ్రమణ్యం, కోడి కత్తి కేసు వ్యవహారంలో గత ప్రభుత్వం వైఖరి, వివేకా హత్యకేసులో కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం వంటి అంశాలను శ్వేతపత్రంలో ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. గడిచిన ఐదేళ్లుగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు పెద్ద ఎత్తున నమోదైన అంశాలను కూడా శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.
అయితే వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది. ఏయే శాఖలో ఎంత మేరకు అవినీతి, అక్రమాలు జరిగాయో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రం మొత్తాన్ని వైఎస్సార్సీపీ నాయకులు దోచుకున్నారని వెల్లడిస్తోంది. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అందుకోసం పని చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిరోజులుగా వరుసగా కొన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏ శాఖలో ఏం జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారిక సమాచారాన్ని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలను వివరిస్తూ, పరిపాలనలో పారదర్శకత కోసం మెుత్తం ఏడు శ్వేతపత్రాలను విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు పోలవరం, అమరావతి, విద్యుత్‌శాఖ, గనుల శాఖలపై శ్వేతపత్రాలు ప్రజల ముందుంచారు. గురువారం శాంతి భద్రతల అంశంపై శ్వేతపత్రాన్ని సీఎం విడుదల చేయనున్నారు.