Chandrababu Tour in Godavari Districts : సీఎం చంద్రబాబు గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్లో బయల్దేరిన ఆయన ముందుగా ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించారు. ఈ క్రమంలోనే కొల్లేరు పరివాహక ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆర్టీసీ కొత్త బస్టాండ్ సమీపంలోని వంతెనకు చేరుకున్న ముఖ్యమంత్రి తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు.
అక్కడి నుంచి సీఆర్‌రెడ్డి డిగ్రీ కళాశాలకు చంద్రబాబు చేరుకున్నారు. అక్కడ ఆడిటోరియం బయట భారీ వర్షాలు, వరదలకు ఏలూరు జిల్లాలో జరిగిన నష్టానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను వీక్షించారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం సమీక్షా సమావేశానికి హాజరైన సీఎం వరద బాధితులు, రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు తమ ఆవేదనను చంద్రబాబుకు తెలియజేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.
గత ప్రభుత్వ తప్పిదాలతో బుడమేరుకు గండ్లు : గత ప్రభుత్వ తప్పిదాల వల్ల విజయవాడ అతలాకుతలం అయిందని చంద్రబాబు ఆరోపించారు. గతంలో బుడమేరుకు గండ్ల పడితే వైఎస్సార్సీపీ సర్కార్ పూడ్చలేదని విమర్శించారు. వారి పాలనలో బుడమేరును ఆక్రమణలకు గురిచేశారని ఆక్షేపించారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చారని దుయ్యబట్టారు. ఎక్కడా ఒక డ్రెయిన్, కాలువ తవ్విన పాపాన పోలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు.
"గత ఐదేళ్ల దుర్మార్గ పాలనలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టాయి. పనిచేసే వ్యక్తులు పనిచేయడం మానేశారు. విజయవాడలో సాధారణ పరిస్థితులు రావడానికి 10 రోజులు పట్టింది. బుడమేరు గండ్లు పూడ్చటానికి ఒక యుద్ధమే చేశాం. ఆర్మీ వాళ్లే మావల్ల కాదని చేతులెత్తేశారు. మా మంత్రులు దగ్గరుండి గండ్లు పూడ్పించారు. ప్రకాశం బ్యారేజీ కొట్టుకుపోతే లంక గ్రామాలు ఏమైపోతాయి? అప్పుడు బాబాయిని చంపి నెపం నెట్టారు. ఇప్పుడు బోట్లతో విధ్వంసం సృష్టించాలని కుట్ర పన్నారు. నేరాలు చేసే వారు ప్రజా జీవితంలో ఉంటే ఇలానే ఉంటుంది. నేరస్థులు రాజకీయ ముసుగు వేసుకున్నారు." - చంద్రబాబు, ముఖ్యమంత్రి
Chandrababu compensation on Flood Victims : వరదల వల్ల నష్టపోయిన ప్రతి వ్యక్తినీ ఆదుకుంటామని చంద్రబాబు తెలిపారు. ఈ నెల 17లోగా పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు. ఏలూరు నగరంలోని శనివారపుపేటకు రూ.15 కోట్లతో వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు. అనంతరం పలువురు ఆయణ్ని కలిసి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, బడేటి రాథాకృష్ణయ్య ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు చెక్కుల రూపంలో విరాళాలు అందించారు.
అనంతరం చంద్రబాబు అక్కడి నుంచి బయలుదేరి కాకినాడ జిల్లాలో పర్యటించారు. సామర్లకోట వద్ద ఏలేరు కాల్వను సందర్శించారు. ఆ తర్వాత కిర్లంపూడి మండంలంలోని రాజుపాలెంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. అక్కడ జేసీబీ ఎక్కి మునిగిన ఇళ్లను పరిశీలించి రైతులు, స్థానికులతో ముఖాముఖి నిర్వహించారు. తిరిగి సామర్లకోటకు చేరుకున్న చంద్రబాబు అధికారులతో సమీక్షించారు.
'వరద బాధితుల కష్టాలను చూశాను. ప్రజలకు చాలా నష్టం జరిగింది. ఏలేరు రిజర్వాయర్‌కు ఒకేసారి 47,000ల క్యూసెక్కులు వచ్చాయి. అధికంగా వరద రావడంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. కలెక్టర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో నష్టం తగ్గింది. గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణను సక్రమంగా చేయలేదు. 65,000ల ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన పంట పొలాలకు హెక్టారుకు రూ.25,000ల పరిహారం అందిస్తాం. ఇండ్లు దెబ్బతిన్న కుటుంబాలకు కొత్త ఇళ్లు నిర్మిస్తాం. వరదల వల్ల దెబ్బతిన్న ఒక్కొక్క వాహనానికి రూ.10,000లు ఇస్తాం. ఈనెల 17వ తేదీ లోపు బాధితులకు పరిహారం. ప్రకృతి విపత్తులను నియంత్రించలేము. ప్రజాహితం కోసం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది' అని చంద్రబాబు తెలిపారు.