CM Chandrababu Speech in Mission Pothole Free AP Program : అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. వెన్నెలపాలెంలో గుంతలు లేని రోడ్లకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. స్వయంగా పార పట్టుకుని గుంతలను పూడ్చారు. అనంతరం రోడ్ రోలర్‌ను నడిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
రోడ్లపై ఈత కొలనులు ఏర్పాటు చేశారు : గత పాలకులే కారణంగా రాష్ట్రంలోని రోడ్లు నరకానికి రహదారిగా మారాయని, మాజీ సీఎం జగన్ రోడ్లపై ఈత కొలనులు ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. రోడ్లపై గుంతలు పూడ్చేందుకు జగన్‌కు మనసు రాలేదని అన్నారు. రహదారులు అభివృద్ధికి చిహ్నమని, గుంతలు లేని రోడ్లకు వెన్నలపాలెంలో శంకుస్థాపన చేశామని, రహదారులు బాగుంటే వ్యాపారాలు బాగా జరుగుతాయని తెలిపారు. సంక్రాంతిలోపు రోడ్లపై ఉన్నటువంటి గుంతలన్నీ పూడ్చాలని అధికారులను ఆదేశించారు.
రౌడీ రాజకీయాలు వద్దని, అభివృద్ధి రాజకీయాలు కావాలని సూచించారు. 2014-19లో రహదారులు ఎలా ఉండేవో గుర్తుకు తెచ్చుకోవాలని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 24 వేల కి.మీ సిమెంట్ రోడ్లు వేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గుంతలు లేని రోడ్లు ఉండాలని, డ్రోన్లు పంపించి గుంతల రోడ్లను పరిశీలిస్తామని అన్నారు. రహదారులపై గుంతలు లేకుండా చూసే బాధ్యత తమదిని, రాష్ట్రంలో మళ్లీ భూతం రాకుండా చూసే బాధ్యత ప్రజలదని పిలుపునిచ్చారు. గత సీఎం రాజధాని పేరిట మూడు ముక్కలాట ఆడారని, రూ.450 కోట్లు పెట్టి రుషికొండలో మాత్రం ప్యాలెస్ కట్టుకున్నారని తెలిపారు. ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష వేయాలో కూడా తెలియట్లేదని అన్నారు.
మంచిరోజులొచ్చాయ్ - గుంతల రోడ్లకు మరమ్మతులు
అనకాపల్లిని పేదరికం లేని జిల్లాగా మారుస్తాం : విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటుకు వైఎస్సార్సీపీ స్థలం ఇవ్వలేదని, దోచుకోవడం తప్ప అభివృద్ధి తెలియని జగన్ కేంద్ర ప్రభుత్వానికి సహకరించకుండా రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ రైల్వే జోన్‌కు స్థలం కేటాయించామని తెలిపారు. నక్కపల్లి వద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇంటికొక ఐటీ ఉద్యోగి రావాలని గతంలో పిలుపు ఇచ్చామని, గ్రామాల్లో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దీపం పథకాన్ని గతంలో అవహేళన చేశారని గుర్తు చేశారు.
నేడు దీపం 2 కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని అన్నారు. వ్యవసాయానికి, డ్వాక్రా మహిళలకు డ్రోన్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు. 175 నియోజక వర్గాల్లో 175 పారిశ్రామిక హబ్‌లు ఏర్పాటు చేస్తామని, రతన్ టాటా స్ఫూర్తితో ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఐదేళ్ల విధ్వంసంతో రాష్ట్రంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయని, జరిగిన నష్టాన్ని ఐదు నెలల సమయంలో సరిదిద్దే చర్యలు చేపట్టామని, పోలవరం నీళ్లు విశాఖకు తరలిస్తామని, అనకాపల్లిని పేదరికం లేని జిల్లాగా మారుస్తామని అన్నారు.
ఈ రూట్లో వెళ్తున్నారా? - గోతుల్లో రోడ్డు వెతుక్కోవాల్సిందే
ఆడపిల్ల అంటే విలాస వస్తువు కాదు : రాష్ట్రంలో ఉచిత ఇసుకలో ఎక్కడా రాజీ లేదని, దొంగతనంగా ఇసుక వ్యాపారం చేస్తే ఊరుకునేది లేదని మరోసారి హెచ్చరించారు. మద్యంలో ఇష్టానుసారం ధరలు పెంచితే ఊరుకోనని, బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానని అన్నారు. గతంలో చెత్త పన్ను అంటూ చెత్త పాలన చేశారని ఎద్దెవా చేశారు. సమాజంలో పరమ నీచులు ఉన్నారని, ఆడపిల్ల అంటే విలాస వస్తువు కాదని, పసిపిల్లలపై అత్యాచారాలు చేస్తున్నారంటే వారిని ఏమనాలి? అని ఎవరైనా ఆడపిల్లల జోలికొస్తే వారికి అదే చివరి రోజని చంద్రబాబు హెచ్చరించారు.
'సంక్రాంతి వరకు గుంతలు పూడ్చేస్తాం- దీపావళికి ఉచిత సిలిడర్ అందుతుంది'