Chandrababu Visit Prakasam District : కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 100రోజులైన సందర్భంగా 'ఇది మంచి ప్రభుత్వం' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా నాగులపాడు మండలంలో దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. వంద రోజుల పాలనలో సర్కార్ అమలు చేసిన కార్యక్రమాలు, ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు చేసిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు.
ఇందులో భాగంగా నాగులప్పలపాడు మండలం చదలవాడలో ఉన్న ఒక ప్రైవేట్ రిసార్ట్స్‌లో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన చంద్రబాబు మద్దిరాలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడ ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై స్థానికులతో చంద్రబాబు చర్చిస్తారు.
Idi Manchi Prabhutvam Program in AP : షెడ్యూల్ ప్రకారం సీఎం శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ఉత్తరాది జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ప్రకాశంలో దీనిని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్ పరిశీలించారు.
రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్నవి ప్రజాప్రభుత్వాలు : మరోవైపు కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై సీఎం చంద్రబాబు స్పందించారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉన్నవి ప్రజా ప్రభుత్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇవి రెండూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం అంకిత భావంతో నిర్ణయాలు తీసుకుంటున్నాయని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలను పటిష్ఠంగా అమలు చేయడమే కాకుండా అభివృద్ధికి సంబంధించి ఏపీ సర్కార్ తీసుకుంటున్న అన్ని నిర్ణయాలకు కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని చంద్రబాబు వెల్లడించారు.
ఈ సహకారం సత్వర ఫలితాలు సాధించేందుకు వీలుకల్పిస్తుందని చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో వందకు పైగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిందని తెలిపారు. గత సర్కార్ అమలు చేసిన నిర్బంధ, అణచివేత విధానాలకు స్వస్తి చెప్పి ప్రజలకు భావప్రకటనా స్వేచ్ఛను తిరిగి తెచ్చిందని గుర్తుచేశారు. అందుకే కూటమి ప్రభుత్వం మంచిదని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.
ప్రజలు మెచ్చేలా - చంద్రబాబు పాలన @ 100 రోజులు - Chandrababu Hundred Days Ruling