CM Chandrababu Speech in NDA legislative Party Meeting: తనను అరెస్టు చేసినప్పుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి వస్తుంటే జగన్ విమానాన్ని క్యాన్సిల్ చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ విమానం లేకపోయినా పవన్ బై రోడ్డు వచ్చారని గుర్తు చేశారు. నందిగామలో పవన్ కల్యాణ్ రాకుండా రోడ్డును మూసేస్తే మీద పడుకున్నారని కొనియాడారు. పవన్ కల్యాణ్ నిజమైన పోరాట యోధుడని అభినందించారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు ఒక ఆశయం కోసం వచ్చారని స్పష్టం చేశారు. ప్రజలు గెలవాలి రాష్ట్రం పునర్నిర్మాణం కావాలని పవన్ కల్యాణ్ కోరాడని గుర్తు చేశారు. మూడు పార్టీలు ఎన్నికల సమయంలో ఎటువంటి గ్యాప్ లేకుండా పని చేశాయన్నారు. పురందేశ్వరి పొత్తుకు అనేక విధాలుగా కృషి చేశారని వెల్లడించారు.
ప్రజలు మెచ్చుకునే విధంగా నడవడిక ఉండాలి: కేంద్రంలో మనం అనుకున్న ప్రభుత్వం లేకపోతే వెంటిలేటర్‌పై ఉన్న ఆంధ్రాను కాపాడటం కష్టమయ్యేదని సీఎం చంద్రబాబు అన్నారు. వైఎస్సార్సీపీ చేసిన అవకతవకలు చూసి మంత్రులు కూడా ఆశ్చర్యపోతున్నారని అన్నారు. కేంద్రం ఇచ్చిన డబ్బులను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా పనిచేశాం కాబట్టి ఇంత గెలుపు వచ్చిందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు మెచ్చుకునే విధంగా మన నడవడిక ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసింది అనేది ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు.
యవతకు 20 లక్షల ఉద్యోగాలు: త్వరలో విశాఖ రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎమ్మెల్యేలు ఒక విజన్ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలని తెలిపారు. 2047 నాటికి పేదరికం అనేది ఉండకూడదని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసిందని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే సహకారంతో మనం ముందుకు పోవాలని దిశానిర్దేశం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు యువతకు ఇచ్చే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. వాలంటీర్లను వాడకుండా ప్రభుత్వ యంత్రాంగంతో ఒకే రోజు 100 శాతం పెన్షన్లు పంపిణీలు చేస్తున్నామని గుర్తుచేశారు.
తప్పు చేసినవాడు తప్పించుకోలేడు: మొదటి రోజే ఉద్యోగస్థులకు జీతాలు అందజేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. తప్పు చేసినవాడు ఎటువంటి పరిస్థితుల్లో తప్పించుకోలేడని, కొంచెం ఆలస్యమైనా అవ్వచ్చు కానీ శిక్ష పడాల్సిందేనని హెచ్చరించారు. అన్నా క్యాంటీన్ రద్దుచేసి జగన్ దుర్మార్గమైన పని చేశాడని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీలో తప్పులు చేసిన వాళ్లని వదిలిపెట్టనని, విచారణలు జరుగుతున్నాయన్న చంద్రబాబు అదే సమయంలో మనం తప్పులు చేయకుండా జాగ్రత్తపడాలని స్పష్టం చేశారు. అక్టోబర్ మొదటి వారంలో కొత్త మద్యం పాలసీ వస్తుందన్నారు. 99 రూపాయలకే పేదవాడికి నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంచబోతున్నామని సీఎం తెలిపారు. రానున్న రెండేళ్లలో పోలవరం ఫేస్ వన్ పూర్తి చేస్తామన్నారు. పోలవరాన్ని పూర్తిచేసి జాతికి రైతులకు అందిస్తామన్నారు. అమరావతికి నిధుల కొరతలేదు ముందుకు తీసుకువెళ్తామని చంద్రబాబు తేల్చిచెప్పారు.
మంత్రివర్గ సమావేశంలో 18 అంశాలపై చర్చ - నిర్ణయాలివే - Cabinet meeting decisions