CM Chandrababu Inaugurated Anna Canteen : అన్నార్తులకు పట్టెడన్నం పెట్టేలా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అన్న క్యాంటీన్ల పునఃప్రారంభానికి శ్రీకారం చుట్టింది. 78వ స్వాతంత్య్ర వేడుకల కానుకగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. సతీమణి భవనేశ్వరితో కలిసి గుడివాడ వచ్చిన సీఎం క్యాంటీన్‌లో 5 రూపాయలకే భోజనం కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు. సతీమణి భువనేశ్వరితో కలిసి స్వయంగా పలువురికి భోజనం వడ్డించారు.
అనంతరం సీఎం దంపతులిద్దరూ ప్రజలతో కలిసి భోజనాన్ని రుచి చూశారు. క్యాంటీన్‌లో భోజనం చేస్తున్న వివిధ వర్గాల వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఏయే వృత్తుల్లో ఉన్నారు. ఎంత మేరకు ఆదాయం సంపాదిస్తున్నారు వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఓ వ్యక్తి తాను చెప్పులు కుడుతూ జీవనం సాగిస్తున్నానని, దుకాణం ఏర్పాటు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పగా ఆయనకు సహాయం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మరో చిరు వ్యాపారికి కొత్త తోపుడు బండి ఇప్పించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలిచ్చారు. అన్న క్యాంటీన్ ఏర్పాటుపై వారంతా ఆనందం వ్యక్తం చేశారు.
నారా భువనేశ్వరి కోటి రూపాయలు విరాళం : అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఎన్టీఆర్‌తో ప్రత్యేక అనుబంధం ఉన్న గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా పేదల కడుపు నింపే క్యాంటీన్ల ప్రారంభోత్సవం తనకెంతో ప్రత్యేకమన్నారు. డొక్కా సీతమ్మ ఎంతోమంది ఆకలి తీర్చిన అన్నపూర్ణ అని కొనియాడారు. అన్న క్యాంటీన్ మళ్లీ పెడతాను అంటే శ్రీనివాస్ రాజు అనే వ్యక్తి కోటి రూపాయలు ఇచ్చారని, నారా భువనేశ్వరి కూడా కోటి రూపాయలు ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
పేదవాళ్లకు తిండి పెట్టడం మనందరి కనీస బాధ్యత : ప్రజలు కూడా తమ వంతు సహకారంతో అన్న క్యాంటీన్లు శాశ్వతంగా నడిచేలా విరాళాలివ్వాలని పిలుపునిచ్చారు. డిజిటల్ విరాళాలు కూడా సేకరించాలని అనుకుంటున్నామని, విరాళాలు ఇవ్వాలని అనుకునేవారు ఎస్‌బీఐ అకౌంట్ నంబర్37818165097, ఐఎఫ్ఎస్సీ కోడ్ SBI002054 అకౌంట్ నంబర్‌కు పంపాలని కోరారు. మీ ఇంట్లో పెళ్లి జరిగితే కొంచెం ఖర్చు తగ్గించుకుని అన్న క్యాంటీన్‌కి సహాకారం ఇవ్వాలన్నారు. అన్న క్యాంటీన్ల కోసం విరాళాలిస్తున్న అందరినీ అభినందిస్తున్నానని అన్నారు.పేదవాళ్లకు తిండి పెట్టడం మనందరి కనీస బాధ్యత అని అన్నారు.
హరేకృష్ణ ఛారిటబుల్ ఫౌండేషన్ ముందుకురావడం సంతోషకరమన్నారు. శాశ్వతంగా కొనసాగించే కార్యక్రమం కావాలని తన ఆకాంక్ష అని అన్నారు. మంచి కార్యక్రమానికి ఖర్చు పెడితే భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. పేదరికం లేని సమాజం కావాలన్నదే తన కల అని అన్నారు. మనం బతకడమే కాకుండా పేదవాళ్లను పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుందామని పిలుపునిచ్చారు.