CM Chandrababu Review on Rains in AP : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు సహా పలు జిల్లాల్లో వర్షాలపై అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం పడడం, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎంవో అధికారులకు సూచించారు.
విరిగిపడ్డా కొండచరియలు : వర్షాల కారణంగా తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో స్వల్పంగా మట్టి, బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. దీంతో అప్రమత్తం అయిన అధికారులు జేసీబీల ద్వారా వాటిని తొలగిస్తున్నారు. ఘాట్‌రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది.
ప్రకాశం జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు - మరికొద్ది గంటల్లో వాయుగుండం!
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు : జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా భక్తులను శ్రీవారి పాదాలు, ఆకాశ గంగ, జాపాలి, పాపవినాశనానికి ప్రాంతాలకు టీటీడీ అనుమతించడం లేదు. ఇప్పటికే భక్తుల భద్రత దృష్ట్యా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వర్షాల కారణంగా తిరుమల గిరుల్లో మాల్వాడిగుండం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కొండల నుంచి వస్తున్న నీటితో తిరుపతి నగరంలోని రాజీవ్‌గాంధీ కాలనీ, ఆటోనగర్, కొరమీనుగుంట కాలనీల్లోకి వరద వచ్చి చేరుతోంది.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం - ఏపీకి పొంచి ఉన్న భారీ వాయుగుండం!
దారి మళ్లిన ఇండిగో విమానం : ఈ నేపథ్యంలోనే ఏర్పేడు మండలం గుడిమల్లం వద్ద సీత కాల్వ కాజ్‌వేపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వర్షాల కారణంగా జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్, జిల్లా స్థాయిలో అధికారులు కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. గూడూరు సబ్‌కలెక్టరేట్‌లో ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాలను అందుబాటులో ఉంచారు. గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, వాకాడు, తడ, కోట, చిల్లకూరులో భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నా నేపథ్యంలో రేణిగుంట రన్‌వేపైకి నీరు చేరింది. దీంతో ల్యాండింగ్ సమస్య తలెత్తిన క్రమంలో ఇండిగో విమానాన్ని చెన్నైకి దారి మళ్లించారు. ఈ విమానం హైదరాబాద్ నుంచి రేణిగుంటకు చేరుకునే క్రమంలో చెన్నైకు పయనం అయ్యింది.