CM Chandrababu Review Meeting on Various Departments : రాష్ట్రంలో రవాణాకు రెక్కలు తొడగాలని ప్రభుత్వం యోచిస్తోంది. దగదర్తి, కుప్పం, మూలపేటల్లో విమానాశ్రయాలకు అవసరమైన చర్యలు ముమ్మరం చేస్తామని పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై సమీక్షలో చంద్రబాబు తెలిపారు. నాగార్జున సాగర్, తాడిపత్రి, తునిల్లో ఎయిర్‌స్ట్రిప్‌లు నిర్మాణానికి పరిశీలిస్తున్నామన్నారు.
విమానాశ్రయాల నిర్మాణ పనులు వేగవంతం : పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. మొత్తంగా 12 నుంచి 14 చోట్ల ఎయిర్ పోర్టులు, ఎయిర్ స్ట్రిప్పులు అందుబాటులోకి తేవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం తెలిపారు. కర్నూలు విమానాశ్రయంలో పైలట్ శిక్షణ కేంద్రం అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. నెల్లూరు జిల్లా దగదర్తి, చిత్తూరు జిల్లా కుప్పంలో విమానాశ్రయాల నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట దగ్గర విమానాశ్రయ నిర్మాణానికి ప్రతిపాదనలను రూపొందిస్తామన్నారు.
ఏపీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు - CM CBN Talks YouTube Academy
కొత్తగా ఎయిర్‌పోర్టులు, ఎయిర్ స్ట్రిప్‌లు : నాగార్జునసాగర్, అనంతపురం జిల్లా తాడిపత్రి, కాకినాడ జిల్లా తుని దగ్గర ఎయిర్ పోర్టులు, ఎయిర్ స్ట్రిప్‌లను నిర్మించే అంశంపై పరిశీలిస్తున్నామని సీఎం తెలిపారు. 2014 -19లో అప్పటి ప్రభుత్వం చేపట్టిన అనేక మౌలిక సదుపాయల ప్రాజెక్టులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. ఆ ప్రాజెక్టులను మళ్లీ తిరిగి చేపడతామని వెల్లడించారు.
మారిటైం బోర్డు, మారిటైం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన స్పెషల్ పర్పస్ వెహికిల్, ఇన్‌లాండ్ వాటర్ వేస్ అథారిటీ ప్రాజెక్టులను క్రియాశీలకం చేస్తామని త్వరలోనే మారిటైం పాలసీని తీసుకొస్తామని తెలిపారు. జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న రియల్ టైం సెంటర్స్‌ని పూర్తి చేస్తామని సీసీ కెమెరాల నెట్‌వర్క్‌ని వాటికి అనుసంధానం చేస్తామన్నారు.
అసమర్థ విధానాలతో అప్పుల్లోకి నెట్టేశారు : గత ప్రభుత్వ అసమర్థత కారణంగా ఏపీ ఫైబర్‌నెట్ కనెక్షన్లు గత ఐదేళ్లలో 9 లక్షల నుంచి 5 లక్షలకు పడిపోయాయని చంద్రబాబు విమర్శించారు. గత ప్రభుత్వం రివర్స్ విధానాలతో ఆ ప్రాజెక్టును రూ. 1258 కోట్ల అప్పుల్లోకి నెట్టేసిందని ధ్వజమెత్తారు. మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు మొత్తాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.దీనిపై విచారణకు ఆదేశించాలని ప్రాధమికంగా నిర్ణయించారు.
కొత్త శాఖల పరిధిలోకి కార్పొరేషన్లు : మరోవైపు సుమారు 2 నెలలకుపైగా మూతపడిన ఫైబర్‌నెట్ కార్యాలయం నేడు తెరుచుకోనుంది.నిర్దేశించిన సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతించనున్నారు. అలాగే కొన్ని కార్పొరేషన్లను కొత్త శాఖల పరిధిలోకి చేరుస్తూ సమీక్షలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సాధారణ పరిపాలన శాఖలోకి ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖ పరిధిలోకి ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్‌లో ఏపీ టవర్ కార్పొరేషన్ విలీనం చేశారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన కంటెంట్ కార్పొరేషన్, డ్రోన్ కార్పొరేషన్, గ్యాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లను పునరుద్ధరించనున్నారు.
ప్రతి మండలంలోనూ భూకుంభకోణం - కబ్జాదారులపై చర్యలు తప్పవన్న చంద్రబాబు - CBN Praja Darbar in NTR Bhavan