CM Chandrababu on Swarnandhra 2047 : రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్స్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని చెప్పారు. భద్రత లేకుంటే రాష్ట్రంలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రారని అన్నారు. శాసనసభలో 'స్వర్ణాంధ్రప్రదేశ్-2047' డాక్యుమెంట్‌పై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్' నినాదంతో దీన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.
పేదరిక నిర్మూలనకు చర్యలు : స్వర్ణాంధ్రప్రదేశ్-2047 కోసం పది సూత్రాలతో విజన్ రూపొందించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆయన సభలో ప్రవేశపెట్టారు. పది సూత్రాలపైనే ఎకానమీ, సర్వీసెస్, భవిష్యత్తు ఆధారపడుతుందన్న సీఎం పేదరిక నిర్మూలన, సమ్మిళిత వృద్ధిరేటు, ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, మానవ వనరుల వృద్ధి, నీటి వనరుల వృద్ధితో పాటు అగ్రి టెక్, ఉత్తమ లాజిస్టిక్స్, పునరుత్పాదక ఇంధన వనరుల పెంపు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. డీప్ టెక్, స్వచ్ఛ్ ఆంధ్ర, ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టామన్న సీఎం నిర్దిష్ట కాలపరిమితిలో పేదరిక నిర్మూలనకు చర్యలు చేపడతామని చెప్పారు.
సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈఓ భేటీ - స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌పై చర్చ
ఎమ్మెల్యేలకు సూచనలు : 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. మనం స్వర్ణాంధ్ర-2047 నినాదంతో ముందుకెళ్లాలని అన్నారు. ఎమ్మెల్యేలపై బాధ్యత ఉందని, నియోజకవర్గ పరిధిలోనూ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని సూచించారు. 2047 నాటికి మీ నియోజకవర్గం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అందులో పొందుపర్చాలని తెలిపారు. ప్రజలకు సేవ చేస్తే ఏ నియోజకవర్గమైనా గెలిపిస్తారని చంద్రబాబు తెలిపారు.
మాజీ సీఎం జగన్ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయనన్ని తప్పులు చేసారని చంద్రబాబు మండిపడ్డారు. వ్యవస్థలన్నీ పూర్తిగా విధ్వంసం అయ్యాయన్నారు. అధికార యంత్రాంగం నిర్వీర్యం అయ్యిందని విమర్శించారు. అప్పులు పరాకాష్టకు చేరాయని, తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. తప్పులు చేసి వాటిని ఒప్పులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని దుయ్యబట్టారు. అందుకే ఎన్డీయే కూటమి ప్రజలు గెలవాలనే ఎన్నికలకు వెళ్లిందన్నారు. ఏపీ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఎన్డీయే కూటమికి ఇచ్చారని తెలిపారు. అందుకే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. గతంలోనే విజన్ 2020 అని తయారు చేసి పాలనలో అమలు చేశామని గుర్తు చేశారు.
స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నా : చంద్రబాబు
గడచిన ఐదేళ్లలో వైసీపీ చేసిన విధ్వంసం, అవినీతిని ఇప్పటికే చర్చించామని, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠ, బ్రాండ్‌ను దెబ్బతీసేలా ప్రవర్తించారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పించారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తోందని, మరింత సమాచారం తీసుకుని తగిన విధంగా స్పందిస్తామని చెప్పారు. మరొకరు ఇలాంటి తప్పులు చేయకుండా అమెరికా కోర్టులో వేసిన ఛార్జిషీటును అధ్యయనం చేసి ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.