Chandrababu on Sankranti Rush 2025 : సంక్రాంతికి పెద్దసంఖ్యలో పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఏపీకి తరలివస్తున్నారు. సొంత గ్రామాలకు వస్తున్న లక్షలమంది ప్రయాణికులకు సరిపడా బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రయాణికుల రద్దీతో విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం సహా పలు నగరాల్లోని బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలోనే పండగకు వచ్చే ప్రజల ఇబ్బందులను తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
ఇందులో భాగంగా ప్రైవేట్, స్కూళ్లు, కాలేజీల బస్సులను తీసుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. తద్వారా ప్రయాణికులను ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు పంపే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన అందులో వచ్చిన సూచనపై సమీక్షించి వెంటనే ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, రవాణా శాఖ అధికారులను ఆదేశించారు.
ఫిట్నెస్ ఉన్న బస్సులను ఆర్టీసీ ద్వారా నడిపి ప్రజలకు ప్రయాణ కష్టాలు లేకుండా చూడాలని చంద్రబాబు సూచించారు. తీవ్ర రద్దీగా ఉన్న రూట్లతో ఈ తరహా బస్సులతో కొంత మేర ప్రజలకు సౌకర్యం కల్పించాలని సీఎం అభిప్రాయపడ్డారు. తద్వారా ప్రజలను సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు పంపే ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు సూచనలు చేశారు.
Chandrababu Chit Chat 2025 : మరోవైపు గ్రామ, వార్డు సచివాలయాలను క్రమబద్దీకరిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. 2500లోపు జనాభా వరకూ ఒక తరహా సచివాలయం, 2500-5000ల జనాభా వరకూ ఒక తరహా, 5000లు పైబడిన వాటిని మరో జాబితాలోకి తెస్తామని పేర్కొన్నారు. అందుకనుగుణంగా ఉద్యోగులను సర్దుబాటు చేస్తామని చెప్పారు. మిగిలిన వారిని సంబంధిత శాఖలకు అటాచ్ చేయనున్నట్లు వివరించారు. చిత్తూరు జిల్లాని ఉదాహరణగా తీసుకుని సమీక్షిస్తే ఆ జిల్లా నుంచి స్థూల ఉత్పత్తి 2 శాతం మాత్రమే వ్యవసాయం నుంచి వస్తోందన్నారు. 18 శాతం పాడిపరిశ్రమ, మరో 18 శాతం ఉద్యానవన పంటల ద్వారా వస్తున్నట్లు తెలియజేశారు. కానీ చిత్తూరు జిల్లాలో వ్యవసాయ శాఖలో ఎక్కువ ఉద్యోగులు ఉన్నారన్న సీఎం ఈ తరహా అధ్యయనాల ద్వారా ఉద్యోగుల సర్దుబాటు చేస్తున్నామని వెల్లడించారు.
అందుకే నేను ప్రతీ సంక్రాంతికి మా ఊరికి వెళ్తున్నా: సీఎం చంద్రబాబు
జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ - కిటకిటలాడుతున్న టోల్‌గేట్లు