Chandrababu Polavaram Tour Today : వైఎస్సార్సీపీ రివర్స్ విధానాలతో అస్తవ్యస్తంగా మారిన పోలవరానికి జవసత్త్వాలిచ్చి పనులను పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రాజెక్టు పరిశీలన చేసి భవిష్యత్‌లో చేపట్టే పనుల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఉదయం పది గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. పనుల్ని పరిశీలించిన అనంతరం ప్రాజెక్టు పురోగతి, నిర్వాసితుల పునరావాసంపై అధికారులు, ఇంజినీర్లతో సీఎం సమీక్షిస్తారు.
అధికారం చేపట్టిన వెంటనే తొలి పర్యటనగా పోలవరానికి వచ్చిన చంద్రబాబు ప్రాజెక్టుపై తనకున్న అంకితభావం ఎలాంటిదో చెప్పకనే చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రతినెలా ఓ సోమవారం పోలవరాన్ని సందర్శించి, పనులపై ఆయన సమీక్షించేవారు. ప్రస్తుతం ఆ కార్యక్రమానికి మళ్లీ పునరుత్తేజం తీసుకొచ్చారు. ఆ క్రమంలోనే నేడు పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. సీఎం పర్యటనతో పోలవరం నిర్మాణం, పునరావాసం, పరిహారంపై స్పష్టత వస్తుందని రైతులు, నిర్వాసితులు ఆశలు పెట్టుకున్నారు.
2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా చేపట్టే పనుల షెడ్యూల్‌ను సీఎం వెల్లడించనున్నారు. డయాఫ్రంవాల్ నిర్మాణంతోపాటు ఎర్త్‌కం రాక్‌ఫిల్ డ్యాం పనులను వేగంగా పూర్తి చేయడం తొలి ప్రాధాన్యంగా భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుంగిన గైడ్‌బండ్‌ను తిరిగి నిర్మించడానికి ప్రణాళిక చేశారు. స్పిల్ ఛానల్‌లో కాంక్రీట్ పనులు, ఐకానిక్ వంతెన నిర్మాణం పనులను ప్రాధాన్య క్రమంలో చేపట్టనున్నారు.
Chandrababu Inspect Polavaram Works : నిర్వాసితులకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 13 ప్రాంతాల్లో పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారు. ఆ పనులకు సంబంధించి వైఎస్సార్సీపీ పాలనలో గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడ వదిలేశారు. దీంతో కాలనీలు అసంపూర్తిగా నిలిచాయి. ఇప్పటికే పోలవరం మండలంలోని 19 గ్రామాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేశారు. వీరికోసం ఒక్క ప్రాంతంలోనూ పూర్తిస్థాయి సౌకర్యాలతో కాలనీలు సిద్ధం కాలేదు. డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యం, రోడ్లు, ఆసుపత్రి, పాఠశాల, అంగన్‌వాడీ భవనాలు లేక నిర్వాసితులు అవస్థలు పడుతున్నారు.
ఆయా పనులు చేసిన గుత్తేదారులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడేళ్లుగా రూ.210 కోట్ల మేర బిల్లులను బకాయి పెట్టింది. తాజాగా కూటమి సర్కార్ ఈ ఆర్థిక సంవత్సరంలో పాత బకాయిలు చెల్లించడంతోపాటు పునరావాసానికి మరో రూ.502 కోట్లు ఇస్తోంది. నేటి పర్యటనలో సీఎం పరిహారంపై ప్రకటన చేసే అవకాశం ఉంది. పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 12,000ల ఎకరాల భూ సేకరణ చేశారు. 25,000ల కుటుంబాలను నిర్వాసితులుగా ప్రకటించారు. ఇందులో 41.15 కాంటూరు పరిధిలో 44 గ్రామాలు 10,000ల కుటుంబాల వరకు ఉన్నాయి. గతంలో 72 శాతం ప్రాజెక్టు పనులు టీడీపీ పాలనలోనే జరిగాయి. ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 17, రాష్ట్రంలో 54 మండలాల్లో 7.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంది.
పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై స్పష్టత ఇచ్చిన పీపీఏ - రెండు దశల ప్రస్తావన లేదని వెల్లడి
పోలవరం ఎత్తుపై రాజ్యసభలో చర్చ - ఆ విషయంలో తగ్గేదేలేదని వెల్లడి