Chandrababu Press Meet at Srisailam: శ్రీశైలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని స్వామివార్ల దర్శన అనంతరం మీడియాతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. శ్రీశైలంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు ఆనం, కందుల దుర్గేష్, జనార్దన్‌రెడ్డిలతో కమిటీ వేయనున్నట్లు తెలిపారు.
ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలానికి సీప్లేన్ ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. శ్రీశైలం పర్యాటకానికి అనుకూల ప్రాంతమని, తుమ్మలబైలులో టైగర్ సఫారీకి అవకాశం ఉందని అన్నారు. శ్రీశైలం వన్యప్రాణుల అభయారణ్యమన్న చంద్రబాబు, శ్రీశైలం నీళ్లు వదిలినపుడు చాలా ఆహ్లాదంగా ఉంటుందని పేర్కొన్నారు.
శ్రీశైలం రోప్‌వే మంచి అనుభూతిని ఇస్తుందని తెలిపారు. విజయవాడ నుంచి 40 నిమిషాల్లో శ్రీశైలం వచ్చామని, సీప్లేన్‌లో ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు. శ్రీశైలం సమీపంలో గుహలు, కొండలు ఉన్నాయని, సమీప కొండల వద్ద ట్రెక్కింగ్, ధ్యాన కేంద్రం ఉన్నాయన్నారు. శ్రీశైలంలో రోడ్ల వెడల్పుతో పాటు రింగ్‌రోడ్డు నిర్మించామని అన్నారు.
ఎంపీ, ఎమ్మెల్యేల సలహాలు తీసుకుని ముందుకెళ్తామన్న సీఎం, శ్రీశైలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. సున్నిపెంటను నివాస యోగ్యంగా తయారు చేయాల్సి ఉందని, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉందన్నారు. 13వ శతాబ్దం నాటి గండికోట ప్రపంచ ప్రసిద్ధి ప్రాంతమన్న సీఎం, గండికోటలో సాహస కార్యక్రమాలకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. గండికోటను అభివృద్ధి చేస్తే సుందర పర్యాటక ప్రాంతంగా మారుతుందని తెలిపారు.
ఇకపై నీటిలోనూ ఎగరొచ్చు - రాష్ట్రంలో ఏడు ప్రాంతాలలో సర్వీసులు
అప్పటి నుంచే సీ ప్లేన్ కార్యకలాపాలు: గండికోటలో కూడా సీప్లేన్ కార్యకలాపాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇవాళ సీప్లేన్ ట్రయల్‌రన్ జరిగిందని, మార్చి నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. కేంద్ర సహకారంతో సీప్లేన్ కార్యకలాపాలు విస్తృతం చేస్తామన్న సీఎం, గండికోటలో రూ.80 కోట్లతో అభివృద్ధి పనులకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని అన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు పర్యాటక గమ్యస్థానంగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
త్వరలోనే శుభవార్త వింటారు: రాష్ట్రాన్ని పర్యాటక గమ్యస్థానంగా తయారుచేస్తామన్న సీఎం, పర్యాటక రంగంలో ఎక్కువ ఉపాధికి అవకాశాలు ఉన్నాయన్నారు. వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం చేయాలని అన్నారు. రాయలసీమకు గోదావరి జలాలు తీసుకువచ్చే అంశంపై త్వరలోనే శుభవార్త వింటారని తెలిపారు. రాయలసీమ రత్నాల సీమగా మారుతుందని, రాయలసీమకు ఉన్న వనరులు ఎక్కడా లేవని తెలిపారు. ఓర్వకల్లును డ్రోన్ సిటీగా మారుస్తామని, త్వరలో కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. డ్రోన్ పైలట్లు ఓర్వకల్లు నుంచే తయారవుతారని వెల్లడించారు.
వారిపైన పోస్టులు పెట్టినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు: శాంతి భద్రతలు సక్రమంగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయన్న సీఎం, రాష్ట్రంలోని ఏ ఆడబిడ్డలపైనా, చివరాఖరకు వైఎస్సార్సీపీ నేతల మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
సీ ప్లేన్ ప్రారంభం: అంతకు ముందు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దర్శించుకున్నారు. మొదట విజయవాడ పున్నమి ఘాట్‌లో ‘‘ సీ ప్లేన్’’ సర్వీసులను చంద్రబాబు ప్రారంభించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి అందులో ప్రయాణించి శ్రీశైలానికి సీఎం చేరుకున్నారు. శ్రీశైలంలోని పాతాళ గంగలో సీ ప్లేన్ డెమో లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. విజయవాడలోని పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం వరకు సీఎం చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సీ ప్లేన్‌లో ప్రయాణించారు.
ప్రపంచంలో ఎక్కడచూసినా మనవాళ్లే - అనునిత్యం కొత్త ఆలోచనలు చేయాలి: చంద్రబాబు
సామాన్యులకు అందుబాటు ధరల్లో సీ ప్లేన్ ప్రయాణం : రామ్మోహన్ నాయుడు