AP CM Chandrababu Interesting Comments in Kolanukonda : మంచి చేయాలనుకునే వారికి ఇక స్పీడ్ బ్రేకర్లు, విధ్వంసం అనేది ఉండవని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మంచి చేసే వారందరికీ ఏపీ చిరునామాగా ఉంటుందని చెప్పారు. అలాంటి వారంతా ఆంధ్రప్రదేశ్‌లో ఇక ముందుకు రావాలని తెలిపారు. అక్షయ పాత్ర స్ఫూర్తితో అతి త్వరలో అన్న క్యాంటీన్లను పునః ప్రారంభిస్తామని వివరించారు. గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
అంతకుముందు హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని చంద్రబాబు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. గర్భాలయంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. వేంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంతశేష స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. దైవసేవతో పాటు మానవ సేవను సమానంగా హరేకృష్ణ సంస్థ చేస్తోందని చంద్రబాబు అన్నారు.
CBN Visit Hare Krishna Gokula Kshetram : ఆధ్యాత్మిక ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకెళ్లలేమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దైవత్వాన్ని అందరిలో పెంపొందించేలా మధుపండిత్ దాస్ కృషి చేస్తున్నారని కొనియాడారు. 50 మంది ఐఐటీ పట్టభద్రులు సేవా కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే ఆధ్యాత్మిక సేవనూ కొనసాగించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
"వెంకటేశ్వరస్వామి దయతోనే అలిపిరి బాంబు పేలుళ్ల నుంచి బయటపడ్డా. ప్రపంచానికి సేవలందించే అవకాశం కోసమే నాకు తిరిగి ప్రాణభిక్షపెట్టారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలి. అక్షయపాత్ర ద్వారా ప్రతిరోజు 22 లక్షల మందికి భోజనం పెడుతున్నారు. అన్న క్యాంటీన్లను చిన్న ఫిర్యాదు లేకుండా అక్షయపాత్ర నిర్వహించింది. పెనుగొండలో 108 అడుగుల లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం ఏర్పాటుకు కూడా హరేకృష్ణ సంస్థ ముందుకొచ్చింది." - చంద్రబాబు, ఏపీ ముఖ్యమంత్రి
చంద్రబాబు సారథ్యంలో మార్గం సుగమమైంది : అమరావతి నగరంలో నూతన ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టడం శుభసంకేతమని, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దేవాలయాల్లో కూడా రాజకీయాలు చొరబడి, ఆలయాలు నిర్మించకుండా చేసిన ప్రభుత్వాలను చూశామని వ్యాఖ్యానించారు. దేవుడు ఉన్నాడు కాబట్టే ఎన్నో అవరాధాలు అధిగమించి, చంద్రబాబు సారథ్యంలో గోకుల క్షేత్రం నిర్మాణానికి మార్గం సుగమమైందని ఎన్వీ రమణ వెల్లడించారు.
'సమాజంలో ఆధ్యాత్మికతతో పాటు సంస్కృతి, ఆచార వ్యవహారాలను కాపాడటం ఎంతో ముఖ్యం. ఇందులో ఇస్కాన్ సంస్థ ముందుండటంతోపాటు ఎంతోమందికి అన్నదానం కూడా చేస్తోంది. రానున్న రోజుల్లో అన్న క్యాంటీన్లను చంద్రబాబు ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించుడటం శుభపరిణామం. అక్షయపాత్ర ద్వారా గతంలో అన్న క్యాంటీన్లకు ఇస్కాన్ సంస్థ ఎంతో తోడ్పాటునిచ్చింది. ఎవరూ అర్థాకలితో ఉండకూడదనే లక్ష్యంతో, ఇస్కాన్ సంస్థ ఎంతోమందికి అక్షయపాత్ర ద్వారా అన్నదానం చేస్తోందని'' ఎన్వీరమణ కొనియాడారు.
నవయుగ ధర్మరాజు చంద్రబాబు : పాండవులు నడయాడిన అమరావతి ప్రాంతంలో నవయుగ ధర్మరాజుగా చంద్రబాబు, రాజధాని నిర్మాణం తలపెట్టారని అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధుపండిత్ దాస్ అన్నారు. భవిష్యత్ తరాల కోసం ఓ విజన్‌తో తలపెట్టిన రాజధాని నిర్మాణానికి, వెంకటేశ్వరస్వామి, దుర్గమ్మ దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలి ప్రార్థించారు. ధర్మరాజు అడుగుజాడల్లోనే చంద్రబాబు రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. తిరుమలలో ఇప్పటికే ప్రక్షాళన చేపట్టి భక్తుల మనోభావాలను కాపాడే చర్యలు ముఖ్యమంత్రి చేపట్టారన్నారు. అమరావతి ప్రపంచ ఉత్తమ నగరంగా, ఏపీ ఉత్తమ రాష్ట్రంగా వెలుగొందాలని మధుపండిత్ దాస్ ఆకాక్షించారు
ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, సవిత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. మరోవైపు హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని రూ.150కోట్ల వ్యయంతో నిర్వాహకులు అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగానే దేవాదాయ శాఖ ఈ క్షేత్రానికి 6.53 ఎకరాలు కేటాయించింది.
ఏపీకి అండగా నిలవండి - కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు - AP CM CBN MEETS NIRMALA SITARAMAN