CM Chandrababu Met With PM Modi in Delhi Tour : వైఎస్సార్సీపీ పాలనతో ఆర్థిక ఇబ్బందుల పాలైన ఏపీని అన్ని విధాలా ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీని కోరారు. జగన్ ప్రభుత్వ విధానాలతో ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసిందని వచ్చే ఆదాయం జీతాలు, పింఛన్లు, అప్పులకే సరిపోతుందన్నారు. ఆర్థిక ఇక్కట్లు నుంచి గట్టెక్కించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. పోలవరం, అమరావతి నిర్మాణానికి సహకరించాలని ఆర్థిక సాయంతో మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
విభజన సమస్యలు : వరుసగా మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందలు తెలిపారు. ప్రధాని మోదీతో సుమారు 40 నిముషాలు భేటీ అయిన చంద్రబాబు రాష్ట్ర సమస్యలను వివరిస్తూనే అనేక ప్రతిపాదనలు ఆయన ముందు ఉంచారు. విభజన సమస్యలతో పాటు జగన్ దుష్పరిపాలనతో రాష్ట్రానికి అనేక ఇబ్బందులు తలెత్తాయని ప్రధానికి వివరించారు.
Today, I had a constructive meeting with the Hon'ble Prime Minister, Shri @narendramodi Ji, in Delhi to address important matters concerning the welfare and development of Andhra Pradesh. I am confident that under his leadership, our State will re-emerge as a powerhouse among… pic.twitter.com/T8LJMK0DpC
— N Chandrababu Naidu (@ncbn) July 4, 2024
సహజ వనరులను దోపిడీ : దీర్ఘకాలిక ప్రణాళికలు లేకుండా గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని ఈ కారణంగా ఏపీ దారుణంగా దెబ్బతిందని చంద్రబాబు తెలిపారు. అను ఉత్పాదక వ్యయం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం సహజ వనరులను దోపిడీ చేయడం, మానవ వనరుల అభివృద్ధిని గాలికి వదిలేయడంతో ప్రగతి అనేదే లేకుండా పోయందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయాలు పడిపోయి అప్పులు ఆకాశాన్ని తాకినట్లు వెల్లడించారు.
అప్పుల చెల్లింపులు పెరిగిపోయాయి : పోలవరం ప్రాజెక్టు, ఇతర జలవనరులు, రహదారులు, రాజధాని నిర్మాణాలను గత ప్రభుత్వం విస్మరించడం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. రాష్ట్ర ఆదాయం కన్నా జీతాలు, పించన్లు, అప్పుల చెల్లింపులు పెరిగిపోయాయని, దీని వల్ల మూలధన వ్యయం కోసం ప్రభుత్వం వద్ద ఆర్థిక వనరులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాధనం దారి మళ్లింపు : మద్యంపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్నీ గత ప్రభుత్వం తాకట్టు పెట్టి విచక్షణారహితంగా అప్పులు చేసిందని, దానికితోడు ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దారి మళ్లించిందని ప్రధాని దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. ఫలితంగా ప్రజావసరాలు తీర్చడానికి ప్రస్తుతం ఆర్థిక వనరులు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనివ్వకపోతే ఈ సవాళ్ల నుంచి బయటపడటం కష్టమని ప్రధానికి చంద్రబాబు వివరించారు.
ప్రధానంగా 7 అంశాల్లో సాయం : ప్రధానిని చంద్రబాబు ప్రధానంగా 7 అంశాల్లో సాయం కోరారు. స్వల్పకాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టేందుకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం జాతీయ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయడానికి మద్దతుగా నిలవాలని కోరారు.
ప్రత్యేక సహాయం పథకం : అమరావతి రాజధాని నగరం నిర్మించేందుకు, అవసరమైన మౌలిక సదుపాయాలను పూర్తి చేయడానికి సమగ్ర ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో రోడ్లు, వంతెనలు, నీటిపారుదల, తాగునీటి వంటి కీలకమైన ప్రాజెక్టుల పూర్తికి మూలధన పెట్టుబడుల కోసం ప్రత్యేక సహాయం పథకం కింద అదనపు కేటాయింపులు కోరారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి బుందేల్‌ఖండ్ ప్యాకేజీ తరహాలో నిధులు మంజూరు చేయాలని విన్నవించిన చంద్రబాబు దుగ్గరాజపట్నం పోర్టు అభివృద్ధికి మద్దతుగా నిలవాలని కోరారు.
చంద్రబాబుకు మోదీ హామీ : ఏపీ అభివృద్ధి పట్ల తాను సానుకూల దృక్ఫదంతో ఉన్నానని, కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబుకు మోదీ హామీ ఇచ్చినట్లు తెలిసింది. సమావేశం జరిగిన తీరును సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పంచుకున్న సీఎం చంద్రబాబు 'ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన అంశాల పరిష్కారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిర్మాణాత్మక సమావేశం జరిగిందన్నారు. ఆయన నాయకత్వంలో మన రాష్ట్రం మళ్లీ బలమైన పవర్ హౌస్‌గా అవతరిస్తుందన్న పూర్తి నమ్మకం ఉంది' అని పేర్కొన్నారు.