CM Chandrababu met PM Modi : కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారి దిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు (CM Chandrababu Delhi Tour) ప్రధాని మోదీతో ఆయన అధికార నివాసం 7-లోక్‌కల్యాణ్‌మార్గ్‌లో సుమారు గంటపాటు సమావేశమయ్యారు. బడ్జెట్లో ఏపీకి కేటాయించిన నిధుల సత్వర విడుదలే ప్రధాన ఎజెండాగా చర్చించారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యమిస్తూ కేటాయింపులు చేసినందుకు ప్రత్యేకంగా మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
పోలవరం, అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగేందుకు సహకారం అందించాలని మోదీని చంద్రబాబు కోరారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి విడుదల చేయాలని కోరారు. దీనివల్ల జాప్యం లేకుండా నిర్మాణ పనులు మొదలుపెట్టి అనుకున్న గడువులోపు ప్రాజెక్టు పూర్తి చేయడానికి వీలవుతుందని విజ్ఞప్తి చేశారు. అమరావతికి బడ్జెట్‌లో ప్రకటించిన ఆర్థిక సాయాన్ని సాధ్యమైనంత త్వరగా అందిస్తే రాజధాని నిర్మాణ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి వీలవుతుందన్నారు.
ప్రధాని మోదీతో సమావేశమైన సీఎం చంద్రబాబు - CM Chandrababu met Modi
ప్రత్యేక సాయాన్ని విడుదల చేయండి : ఏపీలో మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన వివిధ ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రత్యేక మూలధన పెట్టుబడి సాయం చేస్తామని విభజన చట్టంలో చెప్పిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు బడ్జెట్‌లో ప్రకటించిన ప్రత్యేక సాయాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు వీలుగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదల చేయాలని విన్నవించారు.
రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి : మోదీతో భేటీ అనంతరం నేరుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు ఆమెతో సుమారు గంట పాటు భేటీ అయ్యారు. అక్కడికే కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి కూడా వచ్చారు. విశాఖ ఉక్కు భవిష్యత్తుపై కుమార స్వామితో సీఎం చర్చించారు. విశాఖ ఉక్కు ఏపీ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని దానిలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఆపేసి, సెయిల్‌లో విలీనం చేసి లాభదాయకంగా నడిపేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిసి రాష్ట్ర సత్వర అభివృద్ధికి సహకరించాలని చంద్రబాబు కోరారు.
పోలవరం కొత్త డయాఫ్రం వాల్‌కు గ్రీన్‌సిగ్నల్ - మేఘాకే నిర్మాణ పనులు! - CM Chandrababu Delhi Tour
కలిసికట్టుగా పని చేద్దాం : హోం మంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లిన చంద్రబాబు గంటపాటు ఆయనతో సమావేశమయ్యారు. ఈ భేటీలో విభజన చట్టం ప్రకారం చేయాల్సిన పనుల గురించి మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్డీయే అధికారం చేపట్టిన తర్వాత మొదలు పెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయనకు వివరించారు. కేంద్రం నుంచి తగిన చేయూతనందించాలని కోరగా అమిత్‌షా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ప్రజలు ఏం ఆశించి కూటమికి ఓటేశారో ఆ ఆకాంక్షలను నెరవేర్చడానికి కలిసికట్టుగా పని చేద్దామని ఇద్దరు నాయకులు నిర్ణయించారు.
సానుకూలంగా స్పందించిన మోదీ : రెండు రోజుల సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన విజయవంతంగా సాగిందని నేతలు తెలిపారు. ప్రధాని, కేంద్ర మంత్రులు చంద్రబాబు ప్రతిపాదించిన అన్ని అంశాలపై, సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.